Fake News, Telugu
 

తెలంగాణా ఎన్నికల్లో టాంపర్ చేసిన ఓటింగ్ మెషిన్ వాడారని సూచిస్తూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.

0

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కాంగ్రెస్ పార్టీ నెగ్గిన తరుణంలో ఈ ఎన్నికల్లో టాంపర్ చేసిన ఓటింగ్ మెషిన్ వాడారు అని సూచిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ఒక ఓటర్ బీఆర్ఎస్ అభ్యర్థికి వోట్ వేస్తాడు, కానీ  VVPAT తను కాంగ్రెస్ పార్టీకి వోట్ వేసినట్లు రికార్డు చేస్తుంది. ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

 క్లెయిమ్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక టాంపర్ చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(EVM) వాడారు. 

ఫాక్ట్(నిజం): ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. వీడియో మొదటి భాగంలో గోషామహల్ నియోజకవర్గ ఓటింగ్ మెషిన్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే కెమెరా ఎడమ వైపుకి pan అయ్యి VVPATలో రికార్డు అయిన ఓటు చూపిస్తుందో ఆ భాగం సరోజ్ ఖేడేకర్ అనే ఇంస్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేసిన విడియోలోది. మధ్య ప్రదేశ్ యొక్క భర్వా నియోజకవర్గంలో ఒకరు ఓటు వేస్తూ తీసిన వీడియో ఇది, దీన్ని ఈ వీడియోలోని VVPAT భాగాన్ని కట్ చేసి గోషామహల్ వోటింగ్ మెషీన్‌లో ఓటర్ బీఆర్ఎస్ అభ్యర్థికి వోట్ చేస్తున్న వీడియోకి జోడించి ఈ వైరల్ వీడియోని ఎడిట్ చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

వైరల్ వీడియోని సరిగ్గా గమనిస్తే అది ఎడిట్ చేసిన వీడియో అని చాలా అనుమానాలు వస్తాయి. గోషామహల్ వోటింగ్ మెషీన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పేరు “మొగిలి సునీత” అని కనిపిస్తుంది, కానీ వీడియోలో VVPAT చూపించినప్పుడు అందులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ‘నరేంద్ర పటేల్’ అని చూపిస్తుంది. దీన్ని బట్టి ఈ ఓటింగ్ మెషిన్ కాదు ఈ వైరల్ వీడియోనే టాంపర్ చేయబడింది అని మాకు స్పష్టత వచ్చింది.

దీని గురించి మరిన్ని వివరాల కోసం, VVPAT దృశ్యాలు ఉన్న క్లిప్ పైన ఇంస్టాగ్రామ్ లోగోతో ఉన్న సరోజ్ ఖేడేకర్ అనే వాటర్ మార్క్  చూసి తన అకౌంట్ కోసం వెతికితే, తాను ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ నవంబర్ 17వ తారీఖున అప్లోడ్ చేసినట్లు తెలిసింది. 

మధ్యప్రదేశ్ భర్వా నియోజకవర్గంలో  వోట్ వేస్తూ తీసిన వీడియో ఇది, దీంట్లో వోటింగ్ మెషిన్ పైన కాంగ్రెస్ అభ్యర్థి పేరు నరేంద్ర పటేల్ అని ఉండడం చూడవచ్చు. 

మాకు గోషామహల్ నియోజకవర్గంలో వోట్ చేస్తూ రికార్డ్ చేసిన వీడియో దొరకలేదు కానీ, సరోజ్ ఖేడేకర్ అప్లోడ్ చేసిన వీడియోని బట్టి వైరల్ వీడియో ఎడిట్ చేసింది అని స్పష్టమైంది. ఎవరో గోషామహల్ నియోజకవర్గంలో వోట్ వేస్తూ తీసిన ఓటింగ్ మెషిన్ వీడియోని, మధ్యప్రదేశ్ భర్వా నియోజకవర్గంలో వోట్ వేస్తూ తీసిన వీడియోకి జోడించి, బీఆర్ఎస్ పార్టీకి వోట్ వేస్తే కాంగ్రెస్ పార్టీకి వోట్ రికార్డు అయ్యినట్లు VVPAT చూపిస్తుంది అని అర్థం వచ్చేలా వైరల్ వీడియోని ఎడిట్ చేశారు. 

అదనంగా, గోషామహల్ మరియు భర్వా నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థుల జాబితా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైటులో ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

చివరిగా, తెలంగాణా ఎన్నికల్లో టాంపర్ చేసిన ఓటింగ్ మెషిన్ వాడారని సూచిస్తున్న ఈ వీడియోనే  టాంపర్ చేసిన వీడియో. 

Share.

About Author

Comments are closed.

scroll