కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలని వంద రూపాయిలు తగ్గించిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ల ధరలని వంద రూపాయిలు తగ్గించింది.
ఫాక్ట్ (నిజం): వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డొమెస్టిక్ (ఇంట్లో ఉపయోగించే) గ్యాస్ సిలిండర్ల ధరలలో ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతకగా, జూన్ మాసంలో కమర్షియల్ మరియు డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల పై కేంద్ర ప్రభుత్వం విధించిన ధరల యొక్క వివరాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వెబ్సైటులో లభించాయి. జూన్ మాసంలో ఉన్న ఈ ధరలని మే మరియు ఏప్రిల్ మాసంలో ఉన్న ధరలతో పోల్చి చూడగా, కేంద్ర ప్రభుత్వం కేవలం వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలని మాత్రమే తగ్గించినట్టు తెలిసింది. ఇళ్ళలో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయలేదని స్పష్టమయ్యింది.
ఢిల్లీ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (19 Kg) ధర మే మాసంలో 1595.50 రూపాయిలు ఉంటే, జూన్ మాసంలో 1473.50 రూపాయిలకు తగ్గింది. మే మాసంలోని ధరలతో పోలిస్తే ఢిల్లీ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర 122 రూపాయిలు తగ్గినట్టు తెలుస్తుంది. అదే ఢిల్లీ నగరంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర ఏప్రిల్ మరియు మే మాసంలో 809.00 రూపాయిలు ఉంటే, జూన్ మాసంలో కూడా అదే 809.00 రూపాయిలు ధర ఉన్నట్టు తెలుస్తుంది. గత మూడు నెలల్లో కమర్షియల్ మరియు డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలని పోలుస్తూ చేసిన టేబుల్ ని కింద చూడవచ్చు.
భారత ప్రభుత్వం, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే వినియోగదారులకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (19 Kg) ని, ఇళ్ళలో ఉపయోగించడానికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల (14.2) ని వేర్వేరుగా అందిస్తుంది. హోటల్స్, రెస్టారెంట్స్ మరియు వెల్డింగ్ షాప్స్ లలో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లని ఉపయోగిస్తారు. ఈ వివరాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలని మాత్రమే తగ్గించిందనట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.