Fact Check, Fake News, Telugu
 

TTD అందిస్తున్న వివిధ సేవలపై GST వసూలు చేస్తారు, హుండీ ఆదాయంపై కాదు

0

BJP ప్రభుత్వం తిరుపతి హుండీ ఆదాయం పై 120 కోట్ల GST వసూలు చేసిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: BJP ప్రభుత్వం తిరుపతి హుండీ ఆదాయంపై 120 కోట్ల GST వసూలు చేసింది.

ఫాక్ట్ (నిజం): TTD హుండీ విరాళం ద్వారా అర్జించే ఆదాయం GST పరిధిలోకి రాదు. ఎందుకంటే GST అనేది వస్తవును లేదా సేవలను విక్రయించడం పై విధించే పన్ను. 24 మార్చ్ 2021న రాజ్యసభలో జరిగిన డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ తిరుపతి దేవస్థానం 120 కోట్ల GST కడుతుందని, కేంద్ర ప్రభుత్వం TTD భక్తులకు అందించే కాటేజీ సర్వీస్ పై GST వసూలు చేస్తోందని అన్నారు, ఐతే దీనిని కేంద్ర ప్రభుత్వం తిరుపతి హుండీ ఆదాయంపై GST వసూలు చేస్తోందని తప్పుగా అర్ధం చేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా TTDకి విరాళాలు, దర్శనం మరియు ఆర్జిత సేవల టికెట్స్ విక్రయించడం, హుండీలు, లడ్డూల అమ్మకం, దర్శనానికి వచ్చిన భక్తులు ఉండేందుకు కాటేజీ సర్వీస్ అందించడం, భక్తులు సమర్పించిన తల నీలాలు విక్రయించడం, ఆలయానికి చెందిన ప్రాపర్టీస్ లీజుకు ఇవ్వడం వంటి పలు మార్గాల ద్వారా ఆదాయం చేకూరుతుంది.

TTD హుండీ విరాళం ద్వారా అర్జించే ఆదాయం GST పరిధిలోకి రాదు. ఎందుకంటే GST అనేది వస్తవును లేదా సేవలను విక్రయించడం పై విధించే పన్ను. పైగా ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 12AA కింద రిజిస్టర్ చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు మరియు మతపరమైన ట్రస్టులు విరాళాల రూపంలో పొందే ఆదాయానికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ సెక్షన్ కింద TTD కూడా హుండీ మరియు విరాళాల రూపంలో పొందే ఆదాయానికి మినహాయింపు పొందుతోంది.

ఇక TTD వివిధ సేవల ద్వారా ఆర్జించే ఆదాయం విషయానికొస్తే GST మొదలు కాకముందు ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ టాక్స్ యాక్ట్, 1957 కింద TTDకి వస్తువుల విక్రయం (Sale of Goods) పై సేల్స్ టాక్స్ మినహాయింపునివ్వగా, ఇదే మినహాయింపుని ఆంధ్రప్రదేశ్ VAT యాక్ట్, 2005 ద్వారా కొనసాగించారు. వసతి సదుపాయాలకు సంబంధించి రోజుకి వెయ్యి రూపాయల మరియు అంతకన్నా ఎక్కువ అద్దె ఉన్న సందర్భాలలో టాక్స్ చెల్లించాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లగ్జరీ టాక్స్ యాక్ట్, 1987 కింద TTDకి భక్తులకు కాటేజీల ద్వారా వసతి సదుపాయం కల్పించడం ద్వారా వచ్చే ఆదాయంపై మినహాయింపునిచ్చింది.

ఐతే 2017లో పాత టాక్స్ విధానాన్ని రద్దు చేసి GST విధానాన్ని ప్రారంభించిన తరవాత ఆదాయ పన్ను చట్టం,1961 లోని సెక్షన్ 12AA కింద రిజిస్టర్ చేసుకున్న మతపరమైన ట్రస్టులు అందించే పలు సేవలకు పన్ను మినహాయింపునివ్వగా, మరికొన్ని సేవలకు షరతులతో కూడిన  మినహాయింపునిచ్చింది. ఉదాహరణకి, భక్తులకు అందించే ప్రసాదంపై, దేవాలయ ట్రస్టులు నిర్వహించే మెడికల్ క్యాంపులు, పబ్లిక్ లైబ్రరీలు, అనాథలు, నిరాశ్రయులైన పిల్లలు, శారీరకంగా లేదా మానసికంగా వేధింపులకు గురైన వారికోసం నిర్వహించే పాఠశాలలకు, కాలేజీలకు, GST మినహాయింపునిచ్చారు. ఐతే ప్రసాదాలకు కావలిసిన ముడి సరుకులకు, భక్తులకు అందించే కాటేజీ సర్వీస్ లో రోజుకి వెయ్యి రూపాయల రుసుము దాటిన వాటికి, ఆలయ ట్రస్ట్ కి చెందిన కమ్యూనిటీ హాల్స్, కళ్యాణమండపం లేదా బహిరంగ ప్రదేశాల అద్దె రోజుకు పదివేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆలయ ట్రస్ట్ కి చెందిన షాప్స్ అద్దె నెలకు పది వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఛార్జీలు ఉన్న సందర్బాలలో GST కట్టాల్సి ఉంటుంది.

ఇదే విషయమై 24 మార్చ్ 2021న రాజ్యసభలో జరిగిన డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం 120 కోట్ల రూపాయల GST కడుతుండగా అందులో నుండి తిరిగి 9 కోట్లు క్లెయిమ్ చేసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం తిరుమలలో భక్తులకు అందించే కాటేజీ సర్వీస్ పై కూడా GST వసూలు చేస్తుందని అన్నారు. దీనికి కేంద్ర ఆర్ధిక మంత్రి స్పందిస్తూ GST కన్నా ముందు రోజుకి వెయ్యి లేదా ఎక్కువ అద్దె వసూలు చేసే హోటల్ గదులు మరియు వసతి సదుపాయాలు అందించే వారు సర్వీస్ టాక్స్ కట్టే వారని, దీనినే GST లోను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఐతే విజయ సాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని తిరుపతి హుండీ ఆదాయంపై కేంద్రం GST వసూలు చేస్తోందని తప్పుగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

చివరగా, TTD అందిస్తున్న వివిధ సేవలపై GST వసూలు చేస్తోందన్న మాటని హుండీ ఆదాయంపై GST వసూలు చేస్తోందని తప్పుగా అర్ధం చేసుకున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll