Fake News, Telugu
 

కోల్‌కతాకు సంబంధించిన పాత ఫోటోని మార్ఫ్ చేసి తమిళనాడు ప్రజలు రోడ్లపై ‘వనక్కమ్ మోదీ’ గ్రాఫిటీలు గీస్తు నరేంద్ర మోదీకి స్వాగతం పలికారని షేర్ చేస్తున్నారు

0

తమిళనాడులో గోబ్యాక్ మోదీ నుండి వనక్కమ్ మోదీ అంటూ స్వాగతం పలికే ఆదరణ, మార్పు ప్రజలలో మొదలయ్యిందంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. రోడ్డుపై ప్రజలు “Vanakkam Modi” గ్రాఫిటీని పెయింటింగ్ గీస్తున్న చిత్రాన్ని ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: తమిళనాడు ప్రజలు రోడ్డుపై ‘వనక్కమ్ మోది’ గ్రాఫిటి పెయింటింగ్ గీస్తు నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో రోడ్డుపై ‘Vanakkam Modi’కి  బదులు ‘Go Back Modi’ అనే గ్రాఫిటి రాసి ఉంది. 2020లో నరేంద్ర మోదీ కోల్‌కతా పర్యటన సందర్భంగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAA మరియు NRC బిల్లులను వ్యతిరేకిస్తూ కోల్‌కతా ప్రజలు రోడ్లపై ‘Go Back Modi’ గ్రాఫిటీలు గీసి నిరసన తెలిపారు. ఈ ఫోటోకు తమిళనాడుకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోతో పోలి ఉన్న చిత్రాన్ని  కోల్‌కతాకు చెందిన మయూఖ రంజన్ గోశ్ అనే జర్నలిస్ట్ 11 జనవరి 2020 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. మయూఖ్ రంజన్ గోశ్ షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో రోడ్డుపై ‘Vanakkam Modi’కి బదులు ‘Go Back Modi’ అనే గ్రాఫిటి గీసి ఉంది. ఈ ఫోటో  కోల్‌కతా నగరంలోని యేస్ప్లాండ్ అనే వీధిలో తీసినట్టు మయూఖ్ రంజన్ గోశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

అంతేకాదు, మయూఖ్ రంజన్ గోశ్ షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో కనిపిస్తున్న భవనం పై “METRO CHANNEL CONTROL POST, ARE STREET POLICE STATION” అని రాసి ఉంది.  గూగుల్ మ్యాప్స్‌లో ఈ భవనం కోసం వెతికి చూస్తే, ఈ భవనం కోల్‌కతా నగరంలోని యేస్ప్లాండ్ వీధిలో ఉన్నట్టూ చూపిస్తుంది.   

ఈ ఒరిజినల్ గ్రాఫిటి పెయింటింగ్‌కు సంబంధించి 2020లో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 2020లో నరేంద్ర మోదీ కోల్‌కతా పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAA మరియు NRC బిల్లులని వ్యతిరేకిస్తూ కోల్‌కతా ప్రజలు రోడ్లపై ‘Go Back Modi’ గ్రాఫిటిలు గీసి నిరసన తెలిపినట్టు ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేశారు.

ఇదివరకు, ఒరిజినల్ ఫోటోని షేర్ చేస్తూ తమిళనాడు ప్రజలు ‘Go Back Modi’ అంటూ నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనను వ్యతిరేకించారంటూ షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, కోల్‌కతాకు సంబంధించిన పాత ఫోటోని మార్ఫ్ చేసి తమిళనాడు ప్రజలు రోడ్లపై ‘వనక్కమ్ మోదీ’ అని గ్రాఫిటీలు గీస్తు నరేంద్ర మోదీకి స్వాగతం పలికారని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll