Fake News, Telugu
 

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పాత ఫోటోలని షేర్ చేస్తున్నారు

0

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్ 2023 నాడు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ సందర్భంగా, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, తెల్లం వెంకట్రావు తమ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని, వీళ్లిద్దరు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు.

ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఈ రెండు ఫోటోలు పాతవి. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటో జూన్ 2021లో వాళ్ళు కలిసినప్పటిది. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అని  తెల్లం వెంకట్రావు చెప్పారు. 4 డిసెంబర్ 2023 నాటికి పాడి కౌశిక్ రెడ్డి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు. వాళ్లిద్దరూ కూడా ఈ వార్తలని ఖండించారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

అసలు ఈ సమాచారం వెనుక ఉన్న వాస్తవాలను తనిఖీ చేయడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఈ నాయకులు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో 04 డిసెంబర్ 2023 నాటికి చేరలేదు అని అర్థం అయ్యింది. 

పాడి కౌశిక్ రెడ్డి ఫోటో:

పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డితో ఉన్న ఈ ఫోటోని రెవెర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే, ఇది జూన్ 2021 నాటి ఫోటో అని తెలిసింది. 28 జూన్ 2021 నాడు రేవంత్ రెడ్డి తన Xలో ఈ ఫోటోని పోస్టు చేశారు. ఈ పోస్టు వివరణలో “Thank you @KaushikReddyP9 for the warm wishes.” అని రేవంత్ రెడ్డి రాశారు. 

ఇది ఇలా ఉంచితే, ఇవాళ, అనగా 4 డిసెంబర్ 2023 నాడు పాడి కౌశిక్ రెడ్డి, తన Facebookలో ఒక ప్రెస్ మీట్ లైవ్ స్ట్రీమ్ చేశారు.తనని MLAగా  గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలపడాన్ని మనం ఈ లైవ్ స్ట్రీమ్ వీడియోలో చూడవచ్చు.  ఇదే ప్రెస్ మీట్‌లో తను మాట్లాడుతూ రేవంత్ రెడ్డితో తను దిగిన ఒక పాత ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి, తను కాంగ్రెస్‌లో చేరాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్ అని, దీన్ని ఎవరూ నమ్మొద్దు అని చెప్పారు.   

 తెల్లం వెంకట్రావు ఫోటో:

ఈ ఫోటో గురించి ఇంటర్నెట్లో వెతకగా, తాను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని తెల్లం వెంకట్రావు కొట్టి పారేశారు అని తెలిసింది. దాని గురించి TV9 చేసిన వార్తా కథనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.  

తను కాంగ్రెస్‌లో చేరాడు అని చెప్పి వస్తున్న వార్తలు “దుష్ప్రచారాలు” అని, తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అని  తెల్లం వెంకట్రావు చెప్పారు. 

చివరిగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పాత ఫోటోలని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll