తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ గీతం ఆలపించేటప్పుడు జాతీయ పతాకానికి సెల్యూట్ చేయడానికి చేతులురాని వరంగల్ డిప్యూటీ మేయర్ “రిజ్వానా షమీమ్” అని అంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జాతీయ గీతం పాడేటప్పుడు సెల్యూట్ చేయని వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్.
ఫాక్ట్: న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చిన ఫోటోలలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ జాతీయ జెండాకు సెల్యూట్ చేసినట్టే వచ్చింది. టీ న్యూస్ తెలుగు వారు యు ట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలో జెండా వందనం జరగబోతున్న సమయం ముందు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ అక్కడికి నడిచివస్తున్నట్టు కనబడుతుంది, జెండా ఎగురవేసాక అక్కడ ఉన్నవారందరూ, డిప్యూటీ మేయర్ తో సహా సెల్యూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్ట్ లోని ఇమేజ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అటువంటి ఇమేజ్ తోనే రెండు న్యూస్ ఆర్టికల్స్ లభించాయి. 03 జూన్ 2021 పబ్లిష్ అయిన సాక్షి న్యూస్ పేపర్ యొక్క వరంగల్ అర్బన్ ఎడిషన్ లోని మొదటి పేజి లో ‘సంక్షేమం, అభివృద్ధిలో ముందంజ’ అంటూ ప్రచురించిన ఆర్టికల్ లో మనకు అదే ఫోటో కనబడుతుంది. ఆ కాప్షన్ లో జాతీయ జెండాకు వందన సమర్పణ చేస్తున్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పక్కన కలెక్టర్ తదితరులు అని ఉంది. అక్కడే ఇమేజ్ లో కనబడుతున్న డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ సెల్యూట్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఇదే సంఘటనకు సంభందించి మరో ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.
వరంగల్ లో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమం వీడియోల కోసం వెతుకగా యు ట్యూబ్ లో టీ న్యూస్ తెలుగు వారు అప్లోడ్ చేసిన ‘చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఫ్లాగ్ హోఇస్ట్ ఎట్ కలెక్టర్ ఆఫీస్’ అనే వీడియో లభించింది. ఆ వీడియో లో జెండా వందనం జరగబోతున్న సమయం ముందు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ అక్కడికి నడిచివస్తున్నట్టు కనబడుతుంది, జెండా ఎగురవేసాక అక్కడ ఉన్నవారందరూ, డిప్యూటీ మేయర్ తో సహా సెల్యూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
వరంగల్ లో జరిగిన తెలంగాణా ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కొన్ని ఫోటోలను గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో మరియు వరంగల్ మేయర్ గుండు సుధారాణి తమ ఫేస్బుక్ పేజీ లో పోస్ట్ చేసారు, అందులోని ఫోటోలో కూడా రిజ్వానా షమీమ్ సెల్యూట్ చేసినట్టే ఉంది.
చివరగా, వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ జాతీయ జెండాకు సెల్యూట్ చేయలేదని తప్పుగా షేర్ చేస్తున్నారు.