“YSRCP జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రజాసంబంధాల అధికారి (PRO)గా పని చేసిన ముబినా నిష్కా బేగం వద్ద నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రజాసంబంధాల అధికారి (PRO)గా పని చేసిన ముబినా నిష్కా బేగం వద్ద నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): వై.ఎస్. జగన్ హయాంలో TTD ప్రజాసంబంధాల అధికారిగా పని చేసిన ముబినా నిష్కా బేగం నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీగా బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు అనే వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియోలో ఉన్న బంగారు ఆభరణాలకు తిరుమల దేవస్థానం పీఆర్వోకు ఎలాంటి సంబంధం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లిం వ్యక్తి ఎవరూ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పని చేయలేదని TTD తమ అధికారిక X(ట్విట్టర్)లో 05 జనవరి 2025న స్పష్టం చేసింది. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు డిసెంబర్ 2021లో తమిళనాడులోని వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్‌లో దొంగలు దోచుకున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వెల్లూరు పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రజాసంబంధాల అధికారి (PRO)గా పని చేసిన ముబినా నిష్కా బేగం వద్ద నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయిమ్‌కు మద్దతు ఇచ్చే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేదా వార్తా కథనాల లభించలేదు. ఒకవేళ నిజంగానే ఆదాయపన్ను శాఖ అధికారులు టీటీడీ మాజీ పీఆర్వో నుంచి భారీ మొత్తంలో నగలను స్వాధీనం చేసుకుని ఉంటే కచ్చితంగా మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి.
ఈ క్రమంలోనే వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఈ వీడియోలో ఉన్న బంగారు ఆభరణాలకు తిరుమల దేవస్థానం పీఆర్వోకు ఎలాంటి సంబంధం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లిం వ్యక్తి ఎవరూ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పని చేయలేదని టీటీడీ తమ అధికారిక X(ట్విట్టర్)లో 05 జనవరి 2025న చేసిన పోస్టు (ఆర్కైవ్డ్) లభించింది.
ఇకపోతే, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను తమిళ మీడియా సంస్థ ‘జయ’ కు చెందిన జయా ప్లస్ యూట్యూబ్ ఛానల్‌లో 22 డిసెంబర్ 2021న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు డిసెంబర్ 2021లో తమిళనాడులోని వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్‌లో దొంగలు దోచుకున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వెల్లూరు పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించినవి. ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోలను ఇదే వివరణతో మరో రెండు న్యూస్ ఛానల్స్ కూడా తమ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ సమాచారం ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరిత సమాచారం కోసం తగిన తమిళ కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, డిసెంబర్ 2021 ప్రచురించబడిన పలు తమిళ వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 14 డిసెంబర్ 2021 అర్ధరాత్రి వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి 15 కిలోల బంగారం, దాదాపు 500 గ్రాముల వజ్రాలను కొందరు దుండగులు దోచుకున్నారు. దర్యాప్తు అనంతరం పోలీసులు వెల్లూరులోని ఒక శ్మశానవాటికలో దొంగిలించిన ఆభరణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. జోస్ అలుక్కాస్ షోరూంలో బంగారం, వజ్రాలు దోచుకెళ్లిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు డీకారామన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలో ఇదే వీడియో టీటీడీ బోర్డు సభ్యుడిపై జరిగిన ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగలను చూపిస్తుంది అని వైరల్ కాగా, FACTLY దాన్ని ఫాక్ట్-చెక్ చేసి రాసిన ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు డిసెంబర్ 2021లో తమిళనాడులోని వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్‌లో దొంగలు దోచుకున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వెల్లూరు పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించినవి.