Fake News, Telugu
 

గత ఏడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ భోజన ఖర్చుల కోసం 100 కోట్లు వెచ్చించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు

0

గత ఏడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ భోజన ఖర్చు 100 కోట్లు అయ్యిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టీఐ సమాధానంలో వెల్లడించింది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గత ఏడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ భోజన ఖర్చుల కోసం 100 కోట్లు వెచ్చించినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టీఐ ద్వారా వెల్లడించింది.

ఫాక్ట్ (నిజం): ప్రధాని నరేంద్ర మోదీ తన భోజనానికి మరియు దుస్తులకు అయ్యే ఖర్చులను తానే స్వయంగా భరిస్తారని RTI ద్వారా అడిగిన కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం గతంలో సమాధానమిచ్చించి. గత ఏడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ భోజన ఖర్చుల కోసం 100 కోట్లు వెచ్చించినట్టు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ, ఎక్కడా ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, PMINDIA వెబ్సైటులో ప్రధానమంత్రి భోజన ఖర్చులకి సంబంధించి RTI ద్వారా అడిగిన ప్రశ్నలకి కేంద్ర ప్రభుత్వం, ‘ప్రధానమంత్రి వంటగది ఖర్చులు అనేవి ఆయన వ్యక్తిగత ఖర్చులు. ఈ ఖర్చులు ప్రభుత్వ అకౌంట్ నుండి ఖర్చు చేయరు’, అని సమాధానమిచ్చినట్టు తెలిసింది.

నరేంద్ర మోదీ తైవాన్ పుట్టగొడుగులను తింటారని 2017 గుజరాత్ ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి అల్పేష్ ఠాకూర్ మొట్టమొదట ఒక బహిరంగ సభలో ఆరోపణలు చేసారు. ప్రధాని మోదీ తైవాన్ నుండి దిగుమతి చేసుకున్న పుట్టగొడుగులను రోజుకి అయిదు తింటారని, ఈ తైవాన్ పుట్టగోడుగు ఒక్కొక్కటి 80,000 రూపాయిల ధర పలుకుతుందని అల్పేష్ ఠాకూర్ ఆ సభలో ఆరోపించారు. అయితే, అల్పేష్ ఠాకూర్ చేసిన ఈ ఆరోపణలను బలపరచడానికి ఆధారాలు లేకపోవడంతో, ఈ ఆరోపణలు కేవలం ఉహాగానాలుగా మాత్రమే పరిగణించబడుతున్నాయి.

నరేంద్ర మోదీ భోజన ఖర్చుల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఇంటర్నెట్లో ఏ ఒక్క వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు. ఇదివరకు, నరేంద్ర మోదీ దుస్తుల ఖర్చుల గురించి, ఆరోగ్య చికిత్స ఖర్చులకు సంబంధించి ఇలాంటి ఫేక్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరకు, గత ఏడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ భోజన ఖర్చుల కోసం 100 కోట్లు వెచ్చించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll