Fake News, Telugu
 

2023 ఆస్కార్ అవార్డుల నామినేషన్ జాబితా ఇంకా విడుదల చేయలేదు; కాంతారా చిత్రం అర్హతకు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంది

0

కాంతారా సినిమా ఆస్కార్ కంటెస్టెషన్ లిస్టులో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో టాప్ 15 జాబితాలో నిలిచింది అన్న వార్తలు ఆన్లైన్లో ప్రచారమౌతున్నాయి. అసలు ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: కాంతారా సినిమా ఆస్కార్ కంటెస్టెషన్ లిస్టులో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో టాప్ 15 జాబితాలో నిలిచింది.

ఫాక్ట్ (నిజం): ఆస్కార్ అవార్డుల నామినేషన్ జాబితా విడుదల చేసే ముందు, అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు ‘అకాడమీ అవార్డులకు అర్హత ఉన్న ప్రొడక్షన్స్ రిమైండర్ లిస్ట్’ను విడుదల చేస్తారు. 95వ అకాడమీ అవార్డుల (ఆస్కార్‌లు) నామినేషన్‌లు 24 జనవరి 2023న ప్రకటించబడతాయి. కన్నడ సినిమా కాంతారా ఈ ఏడాది రిమైండర్ లిస్టులో పేర్కొనబడింది. ఆన్లైన్లో వస్తున్న వార్తల్లో చెపుతున్నట్లుగా అది కంటెస్టెషన్ లిస్టు కాదు. అంతే కాదు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో టాప్ 15 జాబితా అనే జాబితా విడుదల చెయ్యలేదు.  ఏదైనా చిత్రం రిమైండర్ లిస్ట్ లో భాగమైతే, అది నామినేట్ లేదా షార్ట్‌లిస్ట్ చేయబడిందని కాదు. ఈ చిత్రం ఆస్కార్‌ల అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అర్థం. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కంటెస్టెషన్ లిస్టు గురించి తెలుసుకోటానికి  ‘ఆస్కార్స్’ అధికారిక వెబ్‌సైట్‌లో వెతకగా, ఇటీవల ఆస్కార్‌లు విడుదల చేసిన ఒక రిమైండర్ లిస్టు లభించింది. ఆ జాబితా పేరు – ‘95వ అకాడమీ అవార్డులకు అర్హత కలిగిన ప్రొడక్షన్‌ల రిమైండర్ లిస్టు’. ఏదైనా చిత్రం ఈ జాబితాలో భాగమైతే, అది నామినేట్ లేదా షార్ట్‌లిస్ట్ చేయబడిందని కాదు. ఆస్కార్‌ల ద్వారా జాబితా చేయబడిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని దీని అర్థం. ఆస్కార్ అర్హత ప్రమాణాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అసలు ఆస్కార్ కంటెస్టెషన్ లిస్టు ‘ఆస్కార్’ అధికారిత వెబ్సైటులో లేనే లేదు.

జాబితాలో పేర్కొన్న నటీనటుల పేర్లు కూడా షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయని అర్థం కాదు. ఆస్కార్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా, “రిమైండర్ లిస్ట్‌లో యాక్టింగ్ కేటగిరీలలో పరిగణనలోకి తీసుకోవడానికి అర్హులైన పెరఫార్మెర్స్ కూడా ఉన్నారు”. రూల్స్ డాక్యుమెంట్‌ కాపీలో, దీనిని కూడా చూడవొచ్చు – “అర్హత ఉన్న ప్రతి చలనచిత్రానికి పది మంది వరకు అర్హులైన నటీమణులు మరియు పది మంది వరకు అర్హులైన నటులతో సహా రిమైండర్ జాబితా, నటీనటుల శాఖ (Actors Branch)లోని క్రియాశీల సభ్యులందరికీ నామినేషన్ బ్యాలెట్‌లతో పాటు అందుబాటులో ఉంచబడుతుంది, ప్రతి కేటగిరీలో సభ్యులు వారి ప్రాధాన్యత క్రమంలో, నటనకు గాను ఐదు కంటే ఎక్కువ  విజేతలుగా రాకుండా ఓటు వేయాలి, …”  ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో టాప్ 15 జాబితా అనేది ‘ఆస్కార్’ అధికారిత వెబ్సైటులో ఎక్కడా కూడా లేదు.

గతంలో అనేక భారతీయ సినిమాలు కూడా ఆస్కార్ ‘రిమైండర్ లిస్ట్’లో భాగమయ్యాయి, కానీ అన్నీ నామినేషన్లు పొందలేదు. గతంలో రిమైండర్ జాబితాలలో భాగమైన కొన్ని భారతీయ చిత్రాలను ఇక్కడ చూడవచ్చు – ‘జై భీమ్’ మరియు ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ (94వ ఆస్కార్స్ ప్రొడక్షన్ రిమైండర్ లిస్ట్), ‘సూరరై పొట్రు’ (93వ), ‘ది సౌండ్ స్టోరీ’ (91వ), ‘పులిమురుగన్’ (90వ), ‘కొచ్చాడైయాన్’ (87వ), ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ (83వ).

ఈ ఏడాది నామినేషన్ల ఓటింగ్ 12 జనవరి 2023న ప్రారంభమవుతుంది. 95వ అకాడమీ అవార్డుల నామినేషన్‌లు 24 జనవరి 2023న ప్రకటించబడతాయి. అకాడమీ డిసెంబర్ 2022లో 10 కేటగిరీల కోసం షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించింది. కేటగిరీలు మరియు షార్ట్‌లిస్ట్‌లను ఇక్కడ చూడవచ్చు. ఈ కేటగిరీలలో షార్ట్‌లిస్ట్ నుండి నామినేషన్లు ఉంటాయి. ఆ 10 కేటగిరీలలో షార్ట్‌లిస్ట్ చేయబడిన భారతీయ చిత్రాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఆస్కార్ ‘రిమైండర్ లిస్ట్’ లో కాంతారా సినిమా ఉంది. అసలు ఆస్కార్ కాంటెస్టేషన్ లిస్టు అనేది ఉండదు. ఆస్కార్ వాళ్ళు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో టాప్ 15 జాబితాని ఏదీ విడుదల చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll