Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలని జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగం తాలూకు చిత్రాలని షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడినట్టు రిపోర్టులు రావడంతో వెంటనే మసీదు కొలను ప్రాంగణాన్ని సీల్ చేయాలనీ వారణాసి కోర్టు 16 మే 2022 నాడు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగం చిత్రాలని కొందరు, మసీదులో బయటపడింది శివలింగం కాదు ఫౌంటెన్ అని మరికొందరు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులలో షేర్ చేసిన ఫోటోలు వారణాసి జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగాన్ని చూపించట్లేదు. ఈ ఫోటోలలో కనిపిస్తున్న ఒక శివలింగం ఓడిశాలోని బాబా బుసందేశ్వర్ దేవాలయంలో కొలువై ఉండగా, మరొక ఫోటోలో కనిపిస్తున్న శివలింగం వియత్నాం దేశంలో తవ్వకాలలో బయటపడింది. ఈ పోస్టులలో షేర్ చేసిన ఫౌంటెన్ ఫోటోలు కూడా జ్ఞానవాపి మసీదుకి సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోలో కనిపిస్తున్న శివలింగం ఓడిశాలోని బాబా బుసందేశ్వర్ దేవాలయంలో కొలువై ఉన్నట్టు తెలిసింది. ఈ దేవాలయానికి సంబంధించిన మరికొన్ని ఫోటోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలో కనిపిస్తున్నది జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2:

జ్ఞానవాపి మసీదులోని ఒక ఫౌంటెన్ నిర్మాణాన్ని శివలింగంగా భావిస్తున్నారంటూ ఈ పోస్టులో ఒక ఫౌంటెన్ ఫోటోని షేర్ చేసారు. పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫౌంటెన్ ఆగ్రాలోని ఇతిమాద్-ఉద్-దౌలా టాంబ్ ప్రాంగణంలో ఉన్నట్టు గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా తెలిసింది. జ్ఞానవాపి మసీదు సర్వేలో బయటపడింది శివలింగం కాదు, కేవలం ఫౌంటెన్ మాత్రమే అని జ్ఞానవాపి మసీదు తరపు లాయర్ ‘NDTV’ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటోకు జ్ఞానవాపి మసీదుకు ఎటువంటి సంబంధం లేదు.

ఫోటో-3:

పై పోస్టులో చేసిన అదే క్లెయింతో సోషల్ మీడియాలో మరొక ఫోటో కూడా షేర్ అవుతుంది. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటో రాజస్తాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు సంబంధించినది అని తెలిసింది. ఈ ఫోటోకు జ్ఞానవాపి మసీదుకు సంబంధించినది కాదు.

ఫోటో-4:

ఈ పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోలో కనిపిస్తున్న శివలింగం వియత్నాం దేశంలో బయటపడినట్టు తెలిసింది. వియత్నాం దేశంలో బయటపడ్డ ఈ శివలింగానికి సంబంధించి పలు కేంద్ర మంత్రులు పెట్టిన ట్వీట్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోని భారత దేశంలో తీయలేదు.  

జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగం దృశ్యాలని ఇటీవల మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కానీ, ఈ వీడియో కనీసం గత ఏడాది నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఈ వీడియో ఎక్కడిదో తెలుసుకోలేనప్పటికి, ఈ వీడియోలో కనిపిస్తున్న శివలింగం ఇటీవల జ్ఞానవాపి మసీదు సర్వేలో బయటపడినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని ఫోటోలని షేర్ చేస్తూ జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగం చిత్రాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll