కోట్ల రూపాయలున్నా, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా, సమంత ఆరోగ్య సమస్యకు లక్ష ఓంకార జపంతో నయం చేసి ఉపశమనం పొందేలా జగ్గీ వాసుదేవ్ మార్గనిర్దేశం చేసారంటూ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌తో సమంత కలిసి దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సమంత జగ్గీ వాసుదేవ్ గారి వద్ద తన క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ ధర్మాన్ని స్వీకరించిందని, ధర్మానుసారం ఎన్నో ప్రశ్నలకు తనకు హిందూ ధర్మంలో సమాధానం దొరికాయని సమంత తెలిపినట్టు మరొక పోస్టులో ఇదే ఫోటోని షేర్ చేస్తూ క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సమంత ఇటీవల జగ్గీ వాసుదేవ్ మార్గనిర్దేశానుసారం క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించింది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోని సమంత 2021 జనవరి నెలలో తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. సమంత ఇటీవల జగ్గీ వాసుదేవ్ మార్గనిర్దేశానుసారం క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇదే ఫోటోని సినీ నటి సమంత 2021 జనవరి నెలలో తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. సమంత కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో జగ్గీ వాసుదేవ్‌ను కలుసుకున్న చిత్రమని ఈ ఫోటోని పలు వెబ్సైట్లు 2021 జనవరి నెలలో పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
సమంత తాను మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని 29 అక్టోబర్ 2022 నాడు ప్రకటించింది. డాక్టర్ల హయాంలో తన వ్యాధికి చికిత్స పొందుతున్నట్టు సమంత అప్పుడు తన పోస్టులో స్పష్టంగా తెలిపింది. జగ్గీ వాసుదేవ్ మార్గనిర్దేశానుసారం తన వ్యాధికి చికిత్స పొందుతున్నట్టు గానీ, క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారినట్టు గానీ సమంత ప్రకటించలేదు. సమంత జగ్గీ వాసుదేవ్ మార్గర్దేశానుసారం హిందూ మతానికి మారినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. సమంత పలు సందర్భాలలో జగ్గీ వాసుదేవ్‌ను కలుసుకున్న చిత్రాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
2016లో నాగచైతన్యతో పెళ్లి ప్రకటించిన తరువాత సమంత తన క్రైస్తవ మతం వదిలి హిందూ మతాన్ని స్వీకరించినట్టు పుకార్లు వచ్చాయి. కానీ, ఈ వార్తాలలో నిజం లేదని అప్పుడు పలు వార్తా సంస్థలు స్పష్టం చేశాయి. అంతేకాదు, నాగచైతన్య సమంతల వివాహం హిందూ మరియు క్రైస్తవ సాంప్రదయాలలో జరిగింది. సమంత తాను క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరిస్తునట్టు, ధర్మానుసారం ఎన్నో ప్రశ్నలకు తనకు హిందూ ధర్మంలో సమాధానం దొరికాయని ఎప్పుడూ తెలుపలేదు.
చివరగా, పాత ఫోటోని షేర్ చేస్తూ సమంత ఇటీవల జగ్గీ వాసుదేవ్ మార్గనిర్దేశానుసారం క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించిందని తప్పుగా షేర్ చేస్తున్నారు.