Fake News, Telugu
 

ఈ వీడియోలో ఆపరేషన్ చేసి తీసిన ‘బ్లాడర్ స్టోన్’ ప్రపంచంలోనే అతి పెద్ద మూత్రాశయ రాయి కాదు

0

మీరు రాళ్లను చూసి ఉంటారు, అయితే గుట్కా, మావా, విమల్ ఫుడ్‌తో చేసిన రాయి, ఆపరేషన్ నుండి బయటపడిన రాయి చూడండి!’ అనే క్లెయిమ్ తో ఒక సర్జరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ చేసి బయటికి తీసిన ఈ రాయి ప్రపంచంలోనే అతి పెద్ద మూత్రాశయ రాయి అని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులోని  నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: వీడియోలో ఆపరేషన్ చేసి బయటికి తీసిన మూత్రాశయ రాయి ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది గుట్కా, మావా వంటివి తినడంతో ఏర్పడింది.

ఫాక్ట్ (నిజం): ఈ ఆపరేషన్ బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ నెఫ్రో యూరాలజీ ఇన్‌స్టిట్యూట్  వారు చేసారు. ఆ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఇంచార్జి , డాక్టర్ కేశవ మూర్తి ప్రకారం ఈ రాయి ప్రపంచంలోనే అతి పెద్ద మూత్రాశయ రాయి కాదు. ఈ రాయికి గుట్కా, మావా వంటి పదార్థాలకు ఎటువంటి సంబంధం లేదు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద మూత్రాశయ రాయి బరువు 1.9 kgs, దీన్ని జోస్ డి కాస్ట్రో డా సిల్వా అనే వ్యక్తి నుండి 25 ఆగష్టు 2003న, ది ఇన్‌స్టిట్యూటో డో క్యాన్సర్ “ఆర్నాల్డో వియెరా డి కార్వాల్హో” లో తొలగించారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియోలో చేస్తున్న క్లెయిమ్ వెనుక నిజానిజాల్ని పరిశీలించటానికి దాని గురించి ఇంటర్నెట్‌లో వెతకడం జరిగింది. ఇది 2018లో అప్లోడ్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్టుకు దారి తీసింది. ఈ పోస్టులో కూడా వైరల్ పోస్టులో ఉన్న వీడియో ఉంది. పోస్టు వివరణలో ఇది ‘విక్టోరియా హాస్పిటల్ బెంగళూరు’లో తీసిన వీడియో అని ఉంది. ఈ ఆధారంతో విక్టోరియా ఆసుపత్రి వారు క్లైములో చెప్తున్నట్లు ప్రపంచంలోనే అతి పెద్ద మూత్రాశయ రాయిని ఆపరేషన్ చేసి బయటికి తీసినట్లు ఏమైనా వార్త కథనాలు 2018లో లేదా అంతకముందు ప్రచురితమయ్యాయా అని ఇంటర్నెట్లో వెతికితే ఎటువంటి సమాచారం దొరకలేదు.

పోస్టులోని క్లెయిమ్ గురించి విక్టోరియా హాస్పిటలోని నెఫ్రో యూరాలజీ ఇన్‌స్టిట్యూట్ ఇన్ఛార్జ్ డాక్టర్ కేశవ మూర్తి ని సంప్రదించటం జరిగింది. ఆయన ఈ పోస్టులో  ఉన్నది తమ హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్ యొక్క వీడియోనే అని స్పష్టం చేసారు. అంతే కాక, గుట్కా, మావ వంటి పదార్థాలకు ఈ మూత్రాశయ రాయికి ఎటువంటి సంబంధం లేదు అని కూడా తెలిపారు. అయితే, డాక్టర్ మూర్తి ఈ మూత్రాశయ రాయి ప్రపంచంలోని పెద్దది అనే క్లెయిమ్ ను నిరాకరించారు. వారు ఏ జర్నల్స్ లో కూడా దీని గురించి ఎటువంటి సమాచారం ప్రచురించలేదని తెలిపారు.

అసలు ప్రపంచంలోనే అతి పెద్ద మాత్రాశయ రాయిని గురించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో వెతకగా ‘జోస్ డి కాస్ట్రో డా సిల్వా’ అనే వ్యక్తి నుండి 25 ఆగష్టు 2003న ‘ది ఇన్‌స్టిట్యూటో డో క్యాన్సర్ “ఆర్నాల్డో వియెరా డి కార్వాల్హో” లో తొలగించారు అని తెలిసింది.

చివరిగా, ఈ వీడియోలో ఆపరేషన్ చేసి తీసిన బ్లాడర్ స్టోన్ ప్రపంచంలోనే అతి పెద్ద మూత్రాశయ రాయి కాదు; ఇది గుట్కా, మావా వంటి పదార్థాల వలన ఏర్పడలేదు.

Share.

About Author

Comments are closed.

scroll