భారతీయ విద్యార్థి మనోజ్ అగర్వాల్ కంటి చూపుని మెరుగు పరిచే ఒక కొత్త ఔషధాన్ని కనుగొన్నట్లు ఒక వార్త కథనం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఔషధం పేరు TopViz అని, 2019లో జరిగిన యూరోపియన్ ఆప్తాల్మాలజీ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి హాజరైన నిపుణులు మనోజ్ ని ప్రశంసించారని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: మనోజ్ అగర్వాల్ అనే భారతీయ వైద్య విద్యార్థి కంటి చూపుని మెరుగు పరిచే TopViz అనే ఒక కొత్త ఔషధాన్ని కనుగొన్నారు.
ఫాక్ట్(నిజం): ఇండియా టైమ్స్ వెబ్సైటు వారి వార్త కథనం లాగా ఉన్న ఈ ఆర్టికల్ నకిలీది. అసలు మనోజ్ అగర్వాల్ అనే వైద్య విద్యార్థి ఇలా TopViz అనే ఔషధాన్ని కనుగొన్నట్లు ఇండియా టైమ్స్ లో గానీ, వేరే వార్త సంస్థలు గానీ ఎటువంటి వార్త కథనాలు ప్రచురించలేదు. వార్త కథనాన్ని మరిపంచేలా ఉన్న ఈ కథనంలో వేర్వేరు సంబంధంలేని ఫొటోలు ఉన్నాయి. అంతే కాదు, వెబ్సైటులో ఏ లింక్ ఓపెన్ చేసినా, ఆ పేజీలో ఉన్న ఫ్లైయింగ్ వీల్ ఓపెన్ అవుతుంది. TopViz అనే కంటి ఔషధం ఇంటర్నెట్లో వేరే ఎలక్ట్రానిక్ షాపింగ్ వెబ్సైటులో విక్రయించాడుతున్నది. ఇది ఒక కంటి సప్లిమెంట్. దీన్ని మనోజ్ అగర్వాల్ కనిపెట్టినట్లు ఇంటర్నెట్లో ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కావున ఇది తప్పుదోవ పట్టించేలాగా ఉంది.
ఈ వెబ్ లింక్ ఇండియా టైమ్స్ వార్తా కథనంలాగా ఉన్నా కూడా, వెబ్సైట్ పేరు www.guaranteegood.com, ఇది చూడడానికి ఒక ఫేక్ వెబ్సైటు లాగా ఉంది. వెబ్సైటులో ఏ లింక్ ఓపెన్ చేసినా, ఆ పేజీలో ఉన్న ఫ్లైయింగ్ వీల్ ఓపెన్ అవుతుంది.
దీని గురుంచి మరింత సమాచారం తెలుసుకోవడానికి, మేము అసలు మనోజ్ అగర్వాల్ అనే భారతీయ వైద్యుడు Topviz అనే కొత్త కంటి ఔషధాన్ని ఏమైనా కనుగొని 2019లో యూరోపియన్ ఆప్తాల్మాలజీ కాంగ్రెస్ లో ప్రసంగం ఇచ్చారా అని ఇంటర్నెట్లో వెతకగా, ఇండియా టైమ్స్ వెబ్సైటులో కానీ మారే వార్త సంస్థల వెబ్సైటులలో కానీ ఏ కథనాలు లభించలేదు.
ఈ ఆర్టికల్ లో ఉన్న మూడు ఫోటోలు, ఒకటి మనోజ్, ఇంకోటి ప్రొఫెసర్ వివేక్ కపూర్, మరియు ఇంకో ముగ్గురు కలిసి ఉన్న ఫోటో. ఈ మూడూ ఒక దానికి ఒకటి సంబంధం లేని ఫోటోలు. మనోజ్ ఫోటో అని చెప్తున్న ఈ ఫోటో ఒక స్టాక్ ఇమేజ్, అడోబీ స్టాక్ వెబ్సైటులో ‘Indian student with book and bag giving a smile in front of camera’ అనే పేరుతో ఉంది. ప్రొఫెసర్ వివేక్ కపూర్ ఫోటో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ ఎహసాన్ మణిది. మూడో ఫోటో ఉజ్బెకిస్థాన్లోని ఖైవ ముజీయం వారి వెబ్సైటులో లభించింది.
Topviz ఒక కంటి సప్లిమెంట్ ఔషధంగా ఇంటర్నెట్లో విక్రయిస్తున్నారు, ఈ వెబ్ లింక్ ద్వారా దాన్ని ప్రమోట్ చెయ్యటానికి ఒక నకిలీ కథనాన్ని తయారుచేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటువంటి వెబ్సైట్ లింకులని ఫిషింగ్ లింక్స్ అంటారు. వ్యక్తిగత సమాచారాన్ని (మొబైలు నెంబర్, పూర్తి పేరు) ఇందులో టైపు చేస్తే మోసపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ఫిషింగ్ గురించి మరింత సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ పొందవచ్చు.
చివరిగా, TopViz అనే కంటి ఔషధ ఫార్ములాను భారతీయ విద్యార్థి మనోజ్ అగర్వాల్ కనిపెట్టినట్లు ఎటువంటి ఆధారాలు లేవు; ఇండియా టైమ్స్ వార్త కథనం లాగా కనిపిస్తున్న ఈ ఫిషింగ్ లింకు ద్వారా TopVizను విక్రయిస్తున్నారు.