Fake News, Telugu
 

ఫోటో లో ఉన్నది హంజా బెండెల్లాజ్ కాదు. తను ఇంకా బ్రతికే ఉన్నాడు

0

బ్యాంకులను హ్యాక్ చేసి దోచుకున్న డబ్బుని ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లో  పంచిన వ్యక్తిని ఉరి తీసారంటూ కొన్ని ఫోటోలను ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): హంజా బెండెల్లాజ్ 217 బ్యాంకులను హ్యాక్ చేసి 400 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు. చివరికి ఇలా ఉరి తీశారు. దొంగపని చేసినా కానీ అతను ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టి జీవితానికి ఆ ఆనందం చాలనుకుని ఉరి తీసే ముందు ఇలా నవ్వుతూనే చనిపోయాడు.

ఫాక్ట్ (నిజం):ఫోటో లో ఉన్నది హంజా బెండెల్లాజ్ కాదు. హంజా బెండెల్లాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మాజిద్ కవూసిఫర్. ఇరాన్ లో న్యాయమూర్తిని చంపినందుకు తనని ఉరితీసారు.

పోస్ట్ లో ఇచ్చిన పేరుని (‘హంజా బెండెల్లాజ్’) గూగుల్ లో వెతికితే అల్-జజీర ఆర్టికల్ ఒకటి వస్తుంది. దాని ప్రకారం హంజా బెండెల్లాజ్ గురించి పోస్ట్ లో చెప్పింది నిజమే, కానీ అతన్ని ఉరి తీయలేదని తెలుస్తుంది. హంజా బెండెల్లాజ్ అల్జీరియాకి చెందిన కంప్యూటర్ హాకర్, పోస్ట్ లో చెప్పినట్టుగా అతను సుమారు రెండు వందల బ్యాంకులను హ్యాక్ చేసి కొన్ని వందల మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచుకున్నాడు. ఆ దోచిన సొమ్మంతా ఆఫ్రికా పాలస్తీనా దేశాల్లోని నిరుపేదలకు పంచాడు

తనకి U.S. కోర్టు ఉరి ప్రకటించిందని కొన్ని పుకార్లు కూడా వచ్చాయి, కానీ హంజా బెండెల్లాజ్ చేసిన తప్పులకు అసలు ఉరి పడదని అల్జీరియాలోని U.S. అంబాసిడర్ ఈ విషయం పై కామెంట్ చేసారు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ లో వెతికితే సెర్చ్ రిజల్ట్స్ లో Reuters ఆర్టికల్ ఒకటి వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం పోస్ట్ లోని ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మాజిద్ కవూసిఫర్. ఇరాన్ లో న్యాయమూర్తిని చంపినందుకు తనని మరియు హోస్సేయిన్ కవూసిఫర్ ని ఉరితీసారు. కావున పోస్ట్ లో పెట్టిన ఫోటోలు మాజిద్ కవూసిఫర్ వి, హంజా బెండెల్లాజ్ వి కావు.

చివరగా, ఫోటో లో ఉన్నది హంజా బెండెల్లాజ్ కాదు. తను ఇంకా బ్రతికే ఉన్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll