Fake News, Telugu
 

డి.యు విద్యార్థి ఫోటో పెట్టి పరీక్షలు వాయిదా వేయకపోవడంతో తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తెలంగాణ విద్యార్థి సునీత ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. ఆఫ్ లైన్ B.Tech పరీక్షలు వాయిదా వేయకపోవడం వల్ల ఆమె మరణించిందని, ఆమె మరణానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని కూడా ఈ పోస్ట్ తెలిపింది. ఈ కధనం ద్వారా పోస్టులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్ : B.Tech పరీక్షలు వాయిదా వేయకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న తెలంగాణకు చెందిన సునీత.

ఫాక్ట్: ఫోటోలో ఉన్న అమ్మాయి బ్రతికే ఉంది, ఆమె పేరు సంకీర్తన, సునీత కాదు. ఆమె ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి B.Com (Hons) చేస్తుంది,  జె.ఎన్.టి.యు హైదరాబాద్ నుండి B.Tech కాదు. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎస్. లక్ష్మీ నారాయణను సంప్రదించగా, ఈ మధ్య ఈ వివరాలతో జె.ఎన్.టి.యు హైదరాబాద్ నుంచి ఎలాంటి ఆత్మహత్య కేసులు రాలేదని ఆయన మాకు తెలిపారు. పరీక్షలు వాయిదా వేయకపోవడం వల్ల B.Tech విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ నుండి ఇటీవల ఎటువంటి వార్తలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

అమ్మాయి ఫోటో పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే చిత్రంతో ‘తెలంగాణ టుడే’ వార్తా కథనం దొరికింది. 25 జనవరి 2021న ప్రచురితమైన ‘డాటర్స్ ఆఫ్ తెలంగాణ స్క్రిప్ట్ సక్సెస్ స్టోరీస్’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో ఆ అమ్మాయి పేరు సంకీర్తన అని, సునీత కాదని తెలిపారు. ఇంటర్మీడియట్ లో 1000 కి 942 మార్కులు పొందిన సంకీర్తన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ విద్యార్థి. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆస్ట్రేలియాకు సిద్ధమవుతోంది. సంకీర్తన తండ్రి కరీంనగర్ లో చిన్న రైతు కాగా, ఆమె తల్లి గృహిణి. కాబట్టి, ఇమేజ్ లో ఉన్న వ్యక్తి సంకీర్తన, సునీత కాదు.

‘గిరీష్ మింటు’ అనే ట్విట్టర్ హ్యాండిల్ సంకీర్తన ఇచ్చిన వివరణ వీడియోను పోస్ట్ చేసి నకిలీ వార్తలను షేర్ చేయవద్దని అభ్యర్థించారు. వీడియోలో ఉన్న అమ్మాయి ఫోటోలో ఉన్న వ్యక్తి తానే అని తెలిపింది. సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న మహిళ యొక్క అస్పష్టమైన చిత్రం మరియు సూసైడ్ నోట్ తనకు చెందినవి కావని కూడా చెప్పింది. అటువంటి నకిలీ వార్తలను షేర్ చేయవద్దని ఆమె కోరింది. సంకీర్తన సోదరుడు అని అంటున్న ఒక వ్యక్తి తన సోదరి బ్రతికే ఉందని మరియు ఆమె B.Tech విద్యార్థి కాదని చెప్పారు. 

ఇండియా టుడే, ఇలా షేర్ అవుతున్న విషయం గురించి సంకీర్తనని అడిగారు. వైరల్ పోస్ట్ లను ఖండిస్తూ, ‘నేను ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన B.Com (Hons)లో నా మొదటి సంవత్సరం చదువుతున్నాను. పోస్ట్ లో పేర్కొన్నట్లుగా నేను B.Tech విద్యార్థిని కాదు. అలాగే, నా చిత్రంతో పాటు షేర్ చేస్తున్న సూసైడ్ నోట్ నేను రాయలేదు. కోవిడ్-19 పరిస్థితి కారణంగా, నేను ఆస్ట్రేలియాకు ఎప్పుడు బయలుదేరగలనో ఖచ్చితంగా తెలియదు. కాబట్టి, ప్రస్తుతానికి నేను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరాలని నిర్ణయించుకున్నాను‘, అని వారితో చెప్పింది.

2021 జూలై 02 నుంచి ఆఫ్ లైన్ పరీక్షలు నిర్వహించాలనే వర్సిటీ నిర్ణయాన్ని నిరసిస్తూ జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జె.ఎన్.టి.యు) హైదరాబాద్ కు చెందిన పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అందువల్ల, పరీక్షలను వాయిదా వేయడానికి సూసైడ్ నోట్ తో ఈ పోస్ట్ ఈ నిరసనల నేపథ్యంలో వైరల్ అయ్యింది. పరీక్షలు వాయిదా వేయకపోవడం వల్ల B.Tech విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ నుండి ఎటువంటి వార్తా కధనాలు మాకు దొరకలేదు.

కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎస్. లక్ష్మీ నారాయణను ఈ పోస్టుకు సంబంధించి వివరాలు అడిగాము. ఈ మధ్య ఈ వివరాలతో జె.ఎన్.టి.యు హైదరాబాద్ నుంచి లేదా ఇటీవల నిరసనల మధ్య ఎలాంటి ఆత్మహత్య కేసులు లేవని మాకు ఆయన తెలిపారు. జె.ఎన్.టి.యు హైదరాబాద్ కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.

చివరగా, పరీక్షలకు వాయిదా వేయకపోవడంపై ఆమె తన జీవితాన్ని ముగించారనే వాదనతో తెలంగాణాకు చెందిన డి.యు. విద్యార్థి ఫోటో తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll