Fake News, Telugu
 

ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అధికారులు కొడుతున్నారంటూ సంబంధం లేని పాత వీడియో ప్రచారంలో ఉంది

0

ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కారణమైన వ్యక్తి పశ్చిమ బెంగాల్‌లోని మాదర్సాలో దాక్కుంటే సీబీఐ అధికారులు పట్టుకొని దేహశుద్ధి చేశారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అలాగే, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి స్టేషన్ మాస్టర్ మహమ్మద్ షరీఫ్ అని చెప్తూ మరికొన్ని పోస్టులు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన మహమ్మద్ షరీఫ్‌ని సిబిఐ అధికారులు పట్టుకొని కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్: మెక్సికోలో పట్టుబడిన ఒక దొంగను కొడుతున్న దృశ్యాలంటూ కనీసం రెండేళ్ల నుంచి ఇదే వీడియో ప్రచారంలో ఉంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బహనాగ బజార్ స్టేషన్ ఇన్-చార్జుగా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు ఎస్. బీ. మొహంతి. అతన్ని ఇదివరకే అధికారులు విచారించారు. మహమ్మద్ షరీఫ్‌ అనే పేరుతో ఆ స్టేషన్లో సిబ్బంది ఎవరూ లేరు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు వివరాలు ఇంకా సీబీఐ వెల్లడించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న బహనాగ బజార్ స్టేషన్ మాస్టర్ మహమ్మద్ షరీఫ్ పరారీలో ఉన్నట్లు గతంలో తప్పుడు ప్రచారం జరిగిన సమయంలో మేము ఈ విషయాన్ని ఫాక్ట్ చెక్ చేసి అసలు ఆ స్టేషన్లో మహమ్మద్ షరీఫ్ అనే పేరుగల స్టేషన్ మాస్టర్ లేడని, ప్రమాదం జరిగిన సమయంలో స్టేషన్ ఇన్-చార్జుగా ఉన్నది స్టేషన్ సూపరింటెండెంట్ ఎస్. బి. మొహంతి అని నిర్ధారించడం జరిగింది. పూర్తి కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఇక వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, మెక్సికోలో పట్టుబడిన ఒక దొంగను కొడుతున్న దృశ్యాలంటూ కనీసం రెండేళ్ల నుంచి ఇదే వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచారంలో ఉంది.

అయితే ఒడిశా రైలు ప్రమాదం జరిగింది జూన్ 2023లో, మరియు ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎవరనే వివరాలను ఇంకా సీబీఐ వెల్లడించలేదు. పైగా, సంబంధిత రైల్వే సిబ్బంది ఎవరూ పరారీలో లేరని, అందరూ విచారణకు సహకరిస్తున్నారని  సౌత్ ఈస్టర్న్ రైల్వే స్పష్టం చేసింది.

చివరిగా, సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తూ ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని సీబీఐ అధికారులు కొడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll