Fake News, Telugu
 

‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేస్తే గుండెపోటు రాదని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

‘విఠ్ఠల విఠ్ఠల’ అనే పేరుని 10 రోజులపాటు రోజూ తొమ్మిది నిముషాల పాటు ఉచ్చరిస్తే గుండె సంబంధిత వ్యాధులని నివారించవచ్చునని, పూణేలోని వేద విజ్ఞాన కేంద్రం వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించిందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేస్తే గుండె సంబంధిత వ్యాధులని నివారించవచ్చునని పుణేలో జరిపిన ఒక పరిశోధనలో రుజువైంది.

ఫాక్ట్: పూణేలో 2014లో ముప్పై మంది ఆరోగ్యవంతులపై చేసిన పరిశోధన ప్రకారం, 10 రోజులపాటు రోజూ 9 నిముషాల సేపు ‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేసిన వారికి బ్లడ్ ప్రెషర్, పల్స్ రేట్, హార్ట్ రేట్ వంటి వివిధ ఆరోగ్య సూచికలు గతంతో పోల్చుకుంటే మెరుగుపడ్డాయి. అయితే ఈ పరిశోధనా వ్యాసంలో ఎక్కడా కూడా ‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేస్తే గుండెపోటు రాదని చెప్పలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ విషయంలో నిజానిజాలను తెలుసుకోవడానికి వైరల్ పోస్టులో చెప్పబడిన పరిశోధనా వ్యాసాన్ని పరిశీలించాం. 2014లో ‘Asian Journal of Complementary and Alternative Medicine’  జర్నల్ లో ఈ వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసంలో ఇవ్వబడిన వివరాల ప్రకారం పూణేకి చెందిన వివిధ వైద్య పరిశోధనా సంస్థలు ఈ పరిశోధనను చేపట్టాయి. 30 మంది ఆరోగ్యవంతులైన వ్యక్తులపై 10 రోజుల పాటు జరిగిన ఈ పరిశోధనను జరిపారు. రోజూ 9 నిముషాల సేపు ఈ ముప్పైమంది ‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేశారు.

10 రోజుల తరువాత ఈ ముప్పైమంది యొక్క బ్లడ్ ప్రెషర్, పల్స్ రేట్, హార్ట్ రేట్ వంటి వివిధ ఆరోగ్య సూచికలు ముందుతో పోల్చుకుంటే మెరుగుపడినట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.

అయితే ఈ వ్యాసంలో ఎక్కడా కూడా ‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేస్తే గుండెపోటు రాదు అని చెప్పలేదు. పైగా ఇది కేవలం ప్రాధమిక పరిశోధన అని, దీని ఆధారంగా మరింత విస్తృతంగా పరిశోధనలను చేయాల్సి ఉందని ఈ వ్యాసంలో స్పష్టంగా చేశారు.

అయితే ‘ఓం’ లేదా మరేదైనా పదాన్ని నామజపం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక ధ్యానం, సంగీతం వంటి వాటి వల్ల కూడా గుండె ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుందని మరికొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

అయితే కేవలం నామజపం, ధ్యానం వంటివి చేయడం వల్ల గుండె వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చునని ఎక్కడ నిరూపించబడలేదు. పౌష్టిక ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, సరైన నిద్ర, ఒత్తిడికి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం వంటి వాటి వల్ల గుండె సంబంధిత వ్యాధులను కొంతవరకు నియంత్రించవచ్చు.

చివరిగా, ‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేస్తే గుండెపోటు రాదని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll