ఇతర ఏ దేశానికి తమ గగనతలం నుండి ప్రయాణించే అనుమతి ఇవ్వని రష్యా, కేవలం భారత్‌కు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చిందని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది.. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇతర ఏ దేశానికి తమ గగనతలం నుండి ప్రయాణించే అనుమతి ఇవ్వని రష్యా, కేవలం భారత్‌కు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చింది.
ఫాక్ట్(నిజం): రష్యా కేవలం పలు దేశాలకు మాత్రమే తమ గగనతలాన్ని మూసివేసింది. ఇందులో ఎక్కువ శాతం యూరోపీయన్ యూనియన్ మరియు నాటో సభ్యత్వ దేశాలే ఉన్నాయి. చాలావరకు దేశాలు రష్యా గగనతలం మీదుగా విమానాలను నడిపిస్తున్నాయి, ఇందులో భారత్ కూడా ఒకటి. ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరియు ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రష్యా గగనతలం అవసరం లేకుండానే ఇతర మార్గంలో ప్రయాణించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి, ఉక్రెయిన్ నగరాలపై దాడి చేస్తున్న నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ రష్యా విమానాలకు తమ గగనతలాలను మూసివేస్తున్నాయి. యూరోపీయన్ యూనియన్ (EU), యుకే, కెనడా మొదలైన దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాలను ఇప్పటికే మూసివేసాయి.
ఐతే దీనికి ప్రతిస్పందనగా రష్యా కూడా పలు దేశాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. బల్గేరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, లాట్వియా, లిథువేనియా, స్లోవేనియా, రోమానియా, ఎస్టోనియాలకు మరియు ఉక్రెయిన్ దేశాల విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. రష్యా ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఆరు దేశాలకు తమ గగనతలాన్ని మూసివేసింది.
ఐతే రష్యా అన్ని దేశాలకు తమ గగనతలాన్ని మూసేయలేదు. రష్యా తమ గగనతలాన్ని మూసేసిన దేశాలలో ఎక్కువ శాతం యూరోపీయన్ యూనియన్ మరియు నాటో దేశాలే ఉన్నాయి. ఇతర దేశాలు రష్యా గగనతలం మీదుగా తమ విమానాలను నడుపుతున్నాయి. ఇందులో భాగంగానే ఇతర దేశాలతో పాటు భరత్ కూడా రష్యా గగనతలం మీదుకు తమ విమానాలను నడిపింది.
ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరియు ఢిల్లీ మధ్య నడిచిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రష్యా గగనతలం అవసరం లేకుండానే ఇతర మార్గంలో ప్రయాణించాయి.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలో విమాన సర్వీస్ ఢిల్లీ మరియు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ మధ్య జరిగినట్టు ఉంది, ఐతే ఇటీవల ఈ మార్గంలో తిరిగిన ఎయిర్ ఇండియా విమానాలు రష్యా గగనతలంపై నుండే ప్రయాణించినట్టు తెలుస్తుంది. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పైన తెలిపినట్టు భారత్ ఇటీవల రష్యా గగనతలాలపై నుండి విమానాలు నడిపినప్పటికి, రష్యా ఈ సదుపాయం ప్రత్యేకంగా భారత విమానాలకు మాత్రమే అందించిందన్న వాదన కరెక్ట్ కాదు. రష్యా తమ గగనతలం నుండి కేవలం కొన్ని దేశాలనే బ్యాన్ చేసింది.
చివరగా, రష్యా తమ గగనతలం నుండి ప్రయాణించే అనుమతి కేవలం భారత్‌కు మాత్రమే ఇచ్చిందన్న వాదన కరెక్ట్ కాదు.