Fake News, Telugu
 

లండన్‌లో నిర్వహించిన పాత ప్రదర్శన వీడియోని ఆఫ్ఘానిస్తాన్‌లో అమ్మాయిలను వేలం వేస్తున్న వీడియో అని షేర్ చేస్తున్నారు

0

ఆఫ్ఘానిస్తాన్ దేశంలో అమ్మాయిలను బహిరంగంగా వేలం పాట పెట్టి అమ్మేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. తాలిబాన్ ఉగ్రవాదులు ఇటీవల ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆఫ్ఘానిస్తాన్ దేశంలో అమ్మాయిలను బహిరంగంగా వేలం వేసి అమ్మేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2014లో లండన్ నగరంలో చేసిన ఒక ప్రదర్శన దృశ్యాలని చూపిస్తుంది. ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు నడిపిస్తున్న సెక్స్ స్లేవ్ మార్కెట్ల గురించి అవగాహన కల్పిస్తూ కుర్దిష్ నిరసనకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో ఆఫ్ఘానిస్తాన్ దేశానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ 07 అక్టోబర్ 2017 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. లండన్ నగరంలో అమ్మాయిలను వేలం పెట్టి అమ్ముతున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని షేర్ చేస్తూ ‘BBC’ న్యూస్ సంస్థ 20 అక్టోబర్ 2014 నాడు తమ వెబ్సైటులో ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. లండన్ నగరంలో కుర్దిష్ నిరసనకారులు ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదుల చర్యలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

2014లో లండన్ నగరంలో నిర్వహించిన ఈ నిరసనకు సంబంధించి ‘Newsweek’ వెబ్సైటు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు నడిపిస్తున్న సెక్స్ స్లేవ్ మార్కెట్ల గురించి అవగాహన కల్పిస్తూ కుర్దిష్ నిరసనకారులు ఈ ప్రదర్శన ఇచ్చినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. డౌనింగ్ స్ట్రీట్, హౌసెస్ అఫ్ పార్లమెంట్ సమీపంలో కుర్దిష్ నిరసనకారులు ఈ ప్రదర్శన ఇచ్చినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుపుతూ ‘Huffington post’ న్యూస్ సంస్థ 16 అక్టోబర్ 2014 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

లండన్ నగరంలో చోటుచేసుకున్న ఈ నిరసనకు సంబంధించి ‘Snopes’ వెబ్సైటు 2016లో ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది లండన్ నగరంలో ఇచ్చిన ఒక పాత ప్రదర్శన దృశ్యాలని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

చివరగా, లండన్‌లో ISISకి వ్యతిరేకంగా నిర్వహించిన పాత ప్రదర్శన వీడియోని ఆఫ్ఘానిస్తాన్‌లో అమ్మాయిలను వేలం వేసి అమ్మేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll