Fake News, Telugu
 

టిప్పు సుల్తాన్ ఒక జిహాదీ, రేపిస్టు అంటూ కర్ణాటక హై కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు

0

టిప్పు సుల్తాన్ గురించి కర్ణాటక హై కోర్టు తీర్పునిచ్చింది అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. “టిప్పు సుల్తాన్ ఒక జిహాదీ, ఒక రేపిస్టు, ఎన్నో పురాతన దేవాలయాలను కూల్చి, ఎందరో అమాయకపు హిందువులను అతి కిరాతకంగా హత్య చేశాడని, మరెందరినో మతం మార్చాడని.తన రాజ్యాన్ని రక్షించు కోవడం కోసం మాత్రమే బ్రిటిష్ వారితో పోరాటం చేశాడు ఆ స్వార్థ పరుడు. అంతే గానీ వాడు మన భారత దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు కాదు.” అని కర్ణాటక హై కోర్టు తీర్పునిచ్చింది అని అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: టిప్పు సుల్తాన్ ఒక జిహాదీ, రేపిస్టు అని కర్ణాటక హై కోర్ట్ ఇచ్చిన తీర్పు.

ఫాక్ట్: టిప్పు సుల్తాన్ గురించి కర్ణాటక హై కోర్టు తమ తీర్పుల్లో ఇలా వ్యాఖ్యానించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. నవంబర్ 2016లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కేసు విచారణలో భాగంగా చీఫ్ జస్టిస్ ఎస్.కే ముఖర్జీ, టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే అని, స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా ఎలా అంటారని వ్యాఖ్యానించినట్టు వార్తలు ఉన్నాయి. కానీ, 03 నవంబర్ 2016న ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు డిస్పోస్ చేసింది, ఆ తీర్పులో టిప్పు సుల్తాన్ గురించి కోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

టిప్పు సుల్తాన్ గురించి కర్ణాటక హై కోర్ట్ ఇటువంటి వ్యాఖ్యలు చేసిందా అని ఇంటర్నెట్‌లో వెతకగా కొన్ని ఆర్టికల్స్ లభించాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతిని కొడగు జిల్లాలో నిర్వహించడం సరికాదని పేర్కొంటూ మంజునాథ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసారు. నవంబర్ 2016లో ఈ కేసు విచారణలో భాగంగా చీఫ్ జస్టిస్ ఎస్.కే ముఖర్జీ, ‘టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే. నిజాంలపై ఆంగ్లేయులు దండెత్తినప్పుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నిజాంలకు మద్దతు ఇచ్చారు. అందువల్ల టిప్పు సుల్తాన్ స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా ఎలా చెబుతారు? అసలు టిప్పు సుల్తాన్ జయంతి ఉద్దేశం ఏమిటీ?’ అని ప్రశ్నిస్తూ కేసును వాయిదా వేసారు.

కానీ, 03 నవంబర్ 2016న ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు డిస్పోస్ చేసింది. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలను పిటిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పింది. అవి పరిగణనలోకి తీసుకొని జయంతి వేడుకలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆర్డర్ ఇక్కడ చూడొచ్చు, అందులో టిప్పు సుల్తాన్ గురించి కర్ణాటక హై కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

టిప్పు సుల్తాన్ జయంతిని (10 నవంబర్) రాష్ట్రం జరుపుతుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2015లో ప్రకటించినప్పటి నుండి ప్రతి నవంబర్ నెలలో కొడగు జిల్లాలో నిరసనలు జరుగుతూనే ఉంది. టిప్పు సుల్తాన్ 1785లో తమ పూర్వీకులను ఊచకోత కోసాడని విశ్వసించే స్థానిక కొడగు ప్రజలకి ఈ వేడుకలు బాగా కోపం తెప్పించేవి.

జులై 2019లో టిప్పు సుల్తాన్ జయంతిని జరుపుకోవడం నిలిపివేయాలని అప్పట్లో కొత్తగా ఎర్పడ్డ బి.ఎస్. యడ్యూరప్ప నాయకత్వంలోని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. టిప్పు జయంతిని జరుపుకోవద్దని ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప కన్నడ, సాంస్కృతిక శాఖను ఆదేశించారు.

టిప్పు సుల్తాన్ గురించి కర్ణాటక హై కోర్టు తమ తీర్పుల్లో పోస్టులో ఉన్నట్టుగా వ్యాఖ్యానించినట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించలేదు.

చివరగా, టిప్పు సుల్తాన్ ఒక జిహాదీ మరియు రేపిస్టు అంటూ కర్ణాటక హై కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll