Fake News, Telugu
 

సరుకులు నమోదు చేసే కార్డుపై ఒక రేషన్ షాప్ డీలర్ జీసస్ ఫోటో వేస్తే, జగన్ ప్రభుత్వం రేషన్ కార్డులపై వేసినట్టు ప్రచారం చేస్తున్నారు.

1

ఆంధ్రప్రదేశ్ లో జీసస్ ఫోటోతో కూడిన రేషన్ కార్డులను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేస్తునట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జీసస్ ఫోటోతో కూడిన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న జగన్ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు కాదు, అది డీలర్‌ సొంతంగా ముద్రించి ఇచ్చే కార్డు. రేషన్ సరుకులు నమోదు చేయడానికి ఆ కార్డుని ఉపయోగిస్తారు. వడ్లమూరు గ్రామంలో ఒక రేషన్ డీలర్ జీసస్ ఫోటోతో ఈ సంవత్సరం సరుకులు నమోదు చేసే కార్డుని ముద్రించి పంపిణీ చేసాడు. తను ఇంతక ముందు సంవత్సరాలలో హిందూ దేవుళ్ళ ఫోటోలతో కూడిన కార్డులను పంపిణీ చేసాడు. కావున, ఒక డీలర్ తను పంపిణీ చేసే సరుకుల నమోదు కార్డు మీద జీసస్ ఫోటో వేస్తే, జగన్ ప్రభుత్వం రేషన్ కార్డుల మీద జీసస్ ఫోటో వేసినట్టు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ వారు ఈ విషయంపై యూట్యూబ్ లో పెట్టిన ఒక వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియో ద్వారా ఫోటోలో ఉన్నది ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు కాదు అని, అది డీలర్‌ సొంతంగా ముద్రించి వినియోగదారులకు సరుకులు నమోదు చేయడానికి ఇచ్చే కార్డు అని తెలుస్తుంది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ తో రేషన్ డీలర్ భర్త సత్యసాయిరాం మాట్లాడుతూ, తామే ప్రతి సంవత్సరం దేవుడి ఫోటోతో ఆ కార్డులను ముద్రిస్తామని, అది ప్రభుత్వం ఇచ్చే కార్డు కాదు అని తెలిపాడు. అంతేకాదు, ఇంతకముందు హిందూ దేవుళ్ళతో కార్డుని ముద్రించామని, ఈ సంవత్సరం జీసస్ ఫోటోతో కార్డుని ముద్రించామని అన్నాడు. ఆ కార్డు ఇవ్వడానికి ఐదు రూపాయలు తీసుకుంటామని తెలిపాడు.

2016, 2017 మరియు 2018 లో హిందూ దేవుళ్ళ ఫోటోతో, 2019 లో జీసస్ ఫోటోతో ఆ రేషన్ డీలర్ ఆ కార్డులు ముద్రించినట్టు ‘India Today’ ఆర్టికల్ లో ఫోటో చూడవొచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన రేషన్ కార్డు యొక్క సాంపిల్ ఫోటోని ‘సాక్షి’ ఆర్టికల్ లో చూడవొచ్చు.

కావున, ఒక డీలర్ తను పంపిణీ చేసే సరుకుల నమోదు కార్డు మీద జీసస్ ఫోటో వేస్తే, జగన్ ప్రభుత్వం రేషన్ కార్డుల మీద జీసస్ ఫోటో వేసినట్టు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విషయం పై స్పందిస్తూ, రేషన్ డీలర్ టీడీపీ పార్టీ వ్యక్తి అని, తను కావాలనే జీసస్ ఫోటోని ముద్రించాడని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇచ్చినట్టు ‘NDTV’ ఆర్టికల్ లో చదవొచ్చు.

ఈ విషయం వైరల్ అయ్యాక పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందిస్తూ, ‘ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌కార్డులకు అనుబంధంగా ఇంకో పేపర్‌ కార్డులను రేషన్‌ డీలర్‌ ఇవ్వకూడదు. దీనిపై మేము చర్యలు తీసుకుంటాం’ అని తెలిపినట్టు ఆంధ్రజ్యోతి ఆర్టికల్ లో చూడవొచ్చు.

చివరగా, సరుకులు నమోదు చేసే కార్డుపై ఒక రేషన్ షాప్ డీలర్ జీసస్ ఫోటో వేస్తే, జగన్ ప్రభుత్వం రేషన్ కార్డులపై వేసినట్టు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll