Fake News, Telugu
 

ఈ వీడియోలోని అనంత పద్మనాభస్వామి విగ్రహాన్ని 2023లో హైదరాబాద్‌కు చెందిన శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారు

0

“7800 కిలోల స్వచ్ఛమైన బంగారం, 7,80,000 వజ్రాలు మరియు 780 క్యారెట్ల వజ్రాలతో తయారు చేసిన 3000 సంవత్సరాల నాటి పురాతన అనంత పద్మనాభస్వామి విగ్రహం” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియోలో కనిపిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటిది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటి కాదు. ఈ వీడియోలో కనిపిస్తున్న విగ్రహాన్ని 2023లో హైదరాబాద్‌కు చెందిన శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారు. ఈ విగ్రహం దాదాపు 2.8 కిలోల బంగారం మరియు దాదాపు 75,000 వజ్రాలతో తయారు చేయబడింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వైరల్ వీడియోను (ఆర్కైవ్డ్) ఆగస్ట్ 2023లో “ilovetrichy” అనే ఇన్‌స్టాగ్రామ్ పేజి షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, వీడియోలో కనిపిస్తున్న విగ్రహాన్ని శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారని, ఈ విగ్రహం దాదాపు 2.8 కిలోల బంగారం మరియు దాదాపు 75,000 వజ్రాలతో తయారు చేయబడింది అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇదే విగ్రహాన్ని చూపిస్తున్న వీడియోను ఆగస్ట్ 2023లో పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విగ్రహాన్ని హైదరాబాద్‌కు చెందిన శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారని  పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).  

ఈ సమాచారం ఆధారంగా ఈ విగ్రహానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఇదే విగ్రహాన్ని చూపిస్తున్న పలు వార్త కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ విగ్రహాన్ని హైదరాబాద్‌కు చెందిన శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారు. శివ నారాయణ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ “కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న అద్భుతమైన విగ్రహం నుండి ప్రేరణ పొంది ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు, ఈ విగ్రహం 8 అంగుళాల ఎత్తు మరియు 8 అంగుళాల పొడవు ఉంటుందని, ఈ విగ్రహాన్ని రూపొందించడానికి రెండు నెలల పాటు ప్రతిరోజూ 16 గంటలు 32 మంది మంది పని చేశారు, అలాగే ఈ విగ్రహం సుమారు 2.8 కిలోల బరువు ఉంటుంది మరియు దాదాపు 75,000 వజ్రాలతో అలంకరించబడింది, ఈ వజ్రాలు సుమారు 500 క్యారెట్లు ఉంటాయని, ఈ విగ్రహానికి కొలంబియన్ పచ్చలు, సహజమైన బర్మీస్ కెంపులు కూడా అలంకరించారు” అని తెలిపారు. శివనారాయణన్ జ్యువెలర్స్ వారి యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజిలో ఈ పద్మనాభ స్వామి విగ్రహం యొక్క వీడియోను ఆగస్ట్ 2023లో షేర్ చేశారు (ఇక్కడ). దీన్ని బట్టి ఈ వీడియోలో కనిపిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటిది కాదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వీడియోలో కనిపిస్తున్న విగ్రహాన్ని 2023లో హైదరాబాద్‌కు చెందిన శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారు.ఈ విగ్రహం దాదాపు 2.8 కిలోల బంగారం మరియు దాదాపు 75,000 వజ్రాలతో తయారు చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll