తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో కొందరు ముస్లింలు కారులో వచ్చి కారును రోడ్డుకు అడ్డంగా పెట్టి లారీ డ్రైవర్లపై దాడి చేసి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తలకు గాయమై రక్తం కారుతున్న వ్యక్తిని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో కొందరు ముస్లింలు లారీ డ్రైవర్లపై దాడి చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఫాక్ట్(నిజం): ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో లారీ డ్రైవర్లపై దాడి చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలో నిందితులు ముస్లింలు కాదు. వాజేడు పోలీసులు Factlyతో మాట్లాడుతూ ఈ దాడి ఘటనలో నిందుతులు ఎవరూ ముస్లింలు కాదని స్పష్టం చేసారు. ఈ కేసులో మైనర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని, అరెస్టయిన వారి పేర్లు కవ్వాల వెంకట శ్రీనివాస్, పూనెం దిలీప్, నీరజ్ కుమార్ అని పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 29 జూన్ 2024న ఇదే ఘటనను రిపోర్ట్ చేస్తూ ‘V6 వెలుగు’ దినపత్రిక తమ వెబ్సైటులో పబ్లిష్ చేసిన వార్త కథనం ఒకటి మాకు లభించింది. ఈ కథనం ప్రకారం, వాజేడు మండలం పగళ్లపల్లి గ్రామ శివారులో 25 జూన్ 2024 రాత్రి కొందరు వ్యక్తులు లారీ డ్రైవర్ను బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. ఈ ఘటనలో భాదిత లారీ డ్రైవర్ పి.గోవిందరాజు వెంకటాపురం సీఐకి ఫిర్యాదు చేశారు. పోలీసులు 28 జూన్ 2024 వాజేడు మండలం జగన్నాథపురం సమీపంలోని వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా, ఛత్తీస్ గఢ్ నుంచి వెంకటాపురం వైపు షిఫ్ట్ డిజైర్ కారులో వస్తున్న ముగ్గురు పోలీసులను చూసి కారు ఆపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకొని విచారించగా పగళ్లపల్లి సమీపంలో లారీ డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేసింది తామేనని ఒప్పుకున్నారని వాజేడు సీఐ తెలిపారు. అరెస్టయిన వారిని వెంకటాపురం మండలం వీరభద్రవరం, పాలెం గ్రామాలకు చెందిన కవ్వాల వెంకట శ్రీనివాస్, పూనెం దిలీప్, నీరజ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ చూడవచ్చు. ఈ సంఘటన గురుంచి ఈనాడు ప్రచురించిన వార్త ఇక్కడ చూడొచ్చు.

ఇదే విషయమై వాజేడు పోలీసులను సంపంద్రించగా వాజేడు ఎస్సై హరీశ్ Factlyతో మాట్లాడుతూ ఈ దాడి ఘటనలో నిందుతులు ఎవరూ ముస్లింలు కాదని స్పష్టం చేసారు. ఈ కేసులో మైనర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని, అరెస్టయిన వారి పేర్లు కవ్వాల వెంకట శ్రీనివాస్, పూనెం దిలీప్, నీరజ్ కుమార్ అని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ ఘటనలో నిందితులు ముస్లింలు కారు మనం నిర్ధారించవచ్చు.
చివరగా, ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో లారీ డ్రైవర్లపై దాడి చేసి డబ్బులు వసూలు చేసిన ముఠాలో ముస్లింలు లేరు.