Fake News, Telugu
 

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనాభా నియంత్రణ బిల్లును ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి ప్రశంసించలేదు

0

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జనాభా నియంత్రణ బిల్లును ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి ప్రశంసించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. కరోనా వైరస్ నియంత్రించడంలో యోగి ఆదిత్యనాథ్ తమ అందరికి ఆదర్శమని, యోగి అదిత్యనాథ్‌ని కొన్ని రోజులు తమ దేశానికి పంపించాలని క్రేగ్ కెల్లి కోరినట్టు కూడా ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జనాభా నియంత్రణ బిల్లును ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి ప్రశంసించారు.

ఫాక్ట్ (నిజం): యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఐవర్‌మెక్టిన్ మందులు ఉపయోగించి కరోనా వైరస్‌ని నియంత్రించిన పద్దతిని ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. ఐవర్‌మెక్టిన్ ఔషధ ఉపయోగాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి తెలిపి తమ దేశాన్ని కరోనా వైరస్ నుండి రక్షించాలని క్రేగ్ కెల్లి యోగి అదిత్యనాథ్‌ని ట్వీట్ ద్వార సహాయం అడిగారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జనాభా నియంత్రణ చట్టం గురించి ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి ఎక్కడా మాట్లాడలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేస్తున్న దానికి సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌ని ప్రశంసిస్తూ 10 జూలై 2021 నాడు పెట్టిన ట్వీట్ దొరికింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా వైరస్ నియంత్రణ చర్యలని క్రేగ్ కెల్లి తన ట్వీట్లో ప్రశంసించారు. యోగి ఆదిత్యనాథ్ కొన్ని రోజులు తమ దేశానికి వచ్చి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఐవర్‌మెక్టిన్ ఔషధ ఉపయోగాలని తెలియజేయాలని తన ట్వీట్‌లో తెలిపారు. 

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఐవర్‌మెక్టిన్ మందులు ఉపయోగించి కరోనా వైరస్‌ని నియంత్రించిన పద్దతిని క్రేగ్ కెల్లి ప్రశంసిస్తు 12జూలై 2021 నాడు మరొక ట్వీట్ పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు, తేలికపాటి కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు ఐవర్‌మెక్టిన్ మందును చికిత్సగా ఉపయోగించడాన్ని క్రేగ్ కెల్లి తన ట్వీట్లో కొనియాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐవర్‌మెక్టిన్ ని ఉపయోగించి కరోనా వైరస్‌ని నియంత్రిస్తున్న తీరుని WHO గుర్తించాలని క్రేగ్ కెల్లి 21 మే 2021 నాడు ట్వీట్ పెట్టారు.

ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి యోగి అదిత్యనాథ్‌కు సంబంధించి పెట్టిన ట్వీట్లని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జనాభా నియంత్రణ బిల్లు గురించి మాత్రం ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి తన ట్వీట్లలో ఎక్కడా ప్రస్తావించలేదు.

11 జూలై 2021 నాడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర జనాభా పాలసీ (2021-2030) మొదటి డ్రాఫ్ట్‌ని రిలీజ్ చేసింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర లా కమిషన్ కూడా దీనికి సంబంధించి ఒక చట్టం ముసాయిదా విడుదల చేసింది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఆంక్షలు విధించింది. అంతేకాదు, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి స్థానికి ఎన్నికలలో పోటి చేసే వీలు కూడా కల్పించలేదు.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పతి రేటుని 2026 వరకు 2.7 నుండి 2.1 తగ్గించి, 2030 వరకు 1.7 తగ్గించాలన్నది ఈ పాలసీ లక్ష్యం.

చివరగా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనాభా నియంత్రణ బిల్లును ఆస్ట్రేలియా ఎంపీ క్రేగ్ కెల్లి ప్రశంసించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll