ఇంగ్లీషులో మాట్లాడడంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారకరామారావు)తో తాను పోటీ పడలేను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇంగ్లీషులో మాట్లాడడంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తాను పోటీ పడలేను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియో 2024 లోకసభ ఎన్నికల సందర్భంగా V6 మీడియా సంస్థ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూకి సంబంధించింది. వాస్తవంగా ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం, ముఖ్యమంత్రి కంటే తాను మెరుగ్గా పనిచేస్తున్నానని చెప్తూ కేవలం బాత్రూంలు కడిగే విషయంలో మాత్రమే తాను కేటీఆర్‌తో పోటీ పడలేను అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం, పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన అధిక నిడివి గల వీడియోని 02 మే 2024న ‘V6 News Telugu’ తమ యూట్యూబ్ ఛానెల్‌లో “CM Revanth Reddy Satires On KTR | CM Revanth Interview | V6 News ” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో 2024 లోకసభ ఎన్నికల సందర్భంగా V6 మీడియా సంస్థ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూకి సంబంధించింది అని తెలుస్తుంది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, టైంస్టాంప్ 00.51 వద్ద వైరల్ క్లిప్ మొదలు అవుతుంది అని తెలిసింది. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం, ముఖ్యమంత్రి కంటే తాను మెరుగ్గా పనిచేస్తున్నానని అన్నారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “మీలాంటి జర్నలిస్ట్లు తన పాలనను విశ్లేషించి, ఇందులో మీరు అండర్ పెర్ఫార్మ్ చేశారు సార్, మీకు పెద్దగా ఇంగ్లీషు రాదు, మీకు చదువు రాదు, మీరు చేయలేకపోయారు కేటీఆర్ అయితే అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడుతాడు, బాత్రూంలు బాగా కడుగలుగుతాడు సార్, మీరు కడగాలేరు అంటే ఓకే ఫైన్. ఆ ఒక విషయంలో నేను పోటీ పడలేను, కేటీఆర్‌తోని బాత్రూంలు కడిగే దాంట్లో, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు లేదు.” అని అన్నారు. దీన్ని బట్టి ఈ వీడియోను ఎడిట్ చేస్తూ ఇంగ్లీషులో మాట్లాడడంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తాను పోటీ పడలేను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని అర్థం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, ఇంగ్లీషులో మాట్లాడడంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తాను పోటీ పడలేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.