Fake News, Telugu
 

ఆస్ట్రేలియాలో భారీ సంఖ్యలో ప్రజలు క్రైస్తవాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజా జనాభా లెక్కల వివరాలు విడుదల చేసిన నేపథ్యంలో ‘ఆ దేశంలో 1980 దశకంలో 90%గా ఉన్న క్రైస్తవ జనాభా ప్రస్తుతం 40%కి పడిపోయిందని, క్రైస్తవ మతాన్ని వదిలేస్తున్న వారిలో 5% మంది హిందూ ధర్మాన్ని స్వేకరిస్తున్నారని’  చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆస్ట్రేలియాలో క్రైస్తవ మతాన్ని వదిలేస్తున్న వారిలో 5% మంది హిందూ ధర్మాన్ని స్వేకరిస్తున్నారు.

ఫాక్ట్(నిజం): 1966 వరకు దాదాపు 90 శాతం మంది ఆస్ట్రేలియన్లు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండేవారు, కాని ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్థుత 2021 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 43.9%కి పడిపోయింది. హిందూ మతంతో పాటు ఇస్లాంను ఆచరించేవారు, ఏ మతాన్ని అనుసరించని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఐతే అక్కడి ప్రజలు క్రైస్తవాన్ని వదిలి హిందూమతాన్ని స్వీకరిస్తున్నారని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సెన్సస్‌లో ఈ అంశంపై ఎలాంటి అధ్యయనం చేయలేదు. అలాగే ఆస్ట్రేలియాలో హిందూ మతాన్ని ఆచరించే వారిలో ఎక్కువ శాతం మంది భారత్ మరియు నేపాల్ వంటి దేశాల నుండి వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆస్ట్రేలియాలో ఇటీవల విడుదల చేసిన 2021 జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా 2016తో పోలిస్తే 23.6 లక్షలు పెరిగి 2.57 కోట్లకు చేరుకుంది. మత ప్రాతిపదికన చూసుకుంటే తాజా లెక్కల ప్రకారం ఆ దేశంలో 43.9% మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఏ మతాన్ని అనుసరించని వారున్నారు. ఆస్ట్రేలియా జనాభాలో ఏ మతాన్ని అనుసరించని వారి సంఖ్య 38.9% ఉంది.

ఐతే ఆస్ట్రేలియాలో ఇస్లాం మరియు హిందూమతం అనుసరించేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2021 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఇస్లాంను అనుసరిస్తున్నవారు 3.2% కాగా, 2.7% మంది హిందూమతాన్ని ఆచరిస్తున్నారు. వీటి తర్వాత 2.4% మంది బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నారు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఆస్ట్రేలియాలో క్రైస్తవ మతాన్ని ఆచరించే వారి సంఖ్య తగ్గుతూ వస్తుందన్న మాట నిజమే. 1966 వరకు దాదాపు 90 శాతం మంది ఆస్ట్రేలియన్లు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండేవారు, కానీ ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 43.9%కి పడిపోయింది.

ఆస్ట్రేలియాలో క్రైస్తవాన్ని వదిలి హిందూ మతాన్ని ఆచరిస్తున్నారా?

ఆస్ట్రేలియాలో హిందూ మతాన్ని ఆచరించే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ, పోస్టులో చెప్తున్నట్టు 5% మంది క్రైస్తవ మతాన్ని వదిలేసి హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారని చెప్పలేం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో హిందూ మతంతో పాటు ఇస్లాంను ఆచరించేవారు, ఏ మతాన్ని అనుసరించని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.

కాబట్టి అక్కడి ప్రజలు క్రైస్తవాన్ని వదిలి కేవలం హిందూ మతాన్నే స్వీకరిస్తున్నారని అనలేం. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సెన్సస్‌లో ఈ అంశంపై ఎలాంటి అధ్యయనం చేయలేదు. కాబట్టి ఈ వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

ఆస్ట్రేలియాలో ప్రజలు హిందూ మతంపై ఆసక్తి చుపిస్తున్నారి పలు కథనాలు రిపోర్ట్ చేసినప్పటికీ, పోస్టులో చెప్తునంత భారీ సంఖ్యలో క్రైస్తవులు హిందూ మతానికి మారుతున్నారని ఎటువంటి కథనాలు రిపోర్ట్ చేయలేదు.

ఇతర దేశాల నుండి వచ్చి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డవారి సంఖ్య ఎక్కువ:

ఆస్ట్రేలియాలో హిందూ మతాన్ని ఆచరిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది ఇతర దేశాల నుండి వచ్చి స్థిరపడినవారు లేక ఇలా స్థిరపడిన వారికి జన్మించినవారే ఉన్నారు. ఉదాహారణకి తాస్మానియా రాష్ట్రంలోని 9,720 మంది హిందువులలో 5,088 మంది నేపాల్‌లో మరియు 2,802 మంది భారత్‌లో జన్మించగా, 898 మంది ఆస్ట్రేలియాలో జన్మించిన వలసదారుల పిల్లలు.

తాజా సెన్సస్ లెక్కల ప్రకారం ఇతర దేశాల నుండి వచ్చి ఆస్ట్రేలియాలో స్థిరపడుతున్న వారిలో ఇంగ్లాండ్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఆగస్టు 2021 నాటికీ, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న 673,352 మంది ప్రజలు తాము భారతదేశంలో జన్మించినట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆస్ట్రేలియాలో హిందూ జనాభా పెరగడానికి ఇతర దేశాల నుండి హిందువులు వచ్చి స్థిరపడడం ఒక ముఖ్య కారణం అని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ఆస్ట్రేలియాలో హిందూ మతాన్ని ఆచరించే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అక్కడ ప్రజలు భారీ సంఖ్యలో క్రైస్తవాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll