Fake News, Telugu
 

చిరుతలు ఒక జింకను వేటాడుతున్న ఫోటోని ఒక తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.

0

ఒక జింకను కొన్ని చిరుత పులులు వేటాడుతున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ, తన రెండు జింక పిల్లలను రక్షించుకోవడానికి తల్లి జింక తనను తాను ఇలా త్యాగం చేసిందని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫోటో వివాదానికి కారణమైంది అని, దీనికి దశాబ్దపు ఉత్తమ ఫోటో అవార్డు కూడా దక్కింది అని ఈ పోస్టులలో చెప్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్చైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తన పిల్లలను రక్షించుకోవడానికి చిరుతలకు తనను తాను త్యాగం చేస్తున్న జింక యొక్క ఫోటో.

ఫ్యాక్ట్(నిజం): ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్, వైరల్ అవుతున్న ఈ కథనం ఫేక్ అని 2017లో స్పష్టం చేశారు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లయమ్ తప్పు.

ముందుగా, ఈ ఫోటో వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ ఫోటోను తీసిన అసలు ఫోటోగ్రాఫర్ యొక్క ఫేస్‌బుక్ పోస్ట్‌ ఒకటి మాకు లభించింది. అలిసన్ బుట్టిగేగ్ అనే  ఫోటోగ్రాఫర్, ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ, తన ఈ  ఫోటో ఒక తప్పుడు కథనంతో వైరల్ అవుతుంది అని వాపోయారు. ఇదే పోస్టులో తను ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథనం ఉన్న ఆమె వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు.

ఆమె వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఈ ఫొటోలో జింకను చంపుతున్నది నరాషా అనే ఒక ‘తల్లి’ చిరుతపులి. సెప్టెంబర్ 2013లో కెన్యాలోని మసై మారాలో ఈ సంఘటన జరిగింది.

ఎర జంతువులని ఎలా చంపాలో తన పిల్లలకు నరాషా నేర్పుతున్నప్పుడు ఈ ఫోటోను తీశారు అని అలిసన్ తన కథనంలో చెప్పారు. అంతే కానీ వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా ఈ జింక తన పిల్లలను కాపాడటానికి తనను తాను చిరుతలకి అర్పించుకుంది అని ఎక్కడా చెప్పలేదు.  అలాగే, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు అని అలిసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక వివరణ ఇచ్చారు.

అదనంగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో మాకు లభించింది. అసలు ఈ వేట జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల పిల్ల జింకలు లేవు అని మనం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

 ఈ ఫోటో తీసినందుకు గాను అలిసన్ ‘Siena International Photography Awards’లో ఒక అవార్డు గెలుచుకున్నారు(ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, చిరుతలు ఒక జింకను వేటాడుతున్న ఒక ఫొటోని ఒక తప్పుడు కథనంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll