Fake News, Telugu
 

దేశంలో పాల ఉత్పత్తి, వినియోగానికి సంబంధించి షేర్ చేస్తున్న ఈ గణాంకాలు తప్పు

0

భారత దేశంలో ప్రతిరోజూ 14 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటే, 50 కోట్ల లీటర్ల పాలను రోజూ ప్రజలకి అమ్ముతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. మిగితా 36 కోట్ల లీటర్ల పాలను కల్తీ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారని, కల్తీ పాలతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిందంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత దేశంలో ప్రతిరోజూ 14 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంటే, 50 కోట్ల లీటర్ల పాలను రోజూ ప్రజలకి అమ్ముతున్నారు.

ఫాక్ట్ (నిజం): 2020-21 వార్షిక సంవత్సరంలో దేశంలో మొత్తంగా 209.96 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే 2021-22లో తెలిపింది. ఈ క్రమంగా 2020-21 వార్షిక సంవత్సరంలో దేశంలో మొత్తంగా 18,460.67 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యింది, అంటే ప్రతి రోజు సగటుగా 50.58 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగిందని తెలుస్తుంది. దేశంలో పాల వినియోగాన్ని తలసరి పాల లభ్యత ఆధారంగా లెక్కిస్తారు. 2020-21లో దేశంలో తలసరి రోజువారీ పాల లభ్యత 427 గ్రాములని ప్రభుత్వం తెలిపింది. కల్తీ పాల తయారీ, అమ్మకాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తూన్న మాట వాస్తవమే అయినప్పటికి, పోస్టులో తెలుపుతున్నట్టు దేశంలో ప్రతి రోజు 36 కోట్ల లీటర్ల కల్తీ పాలు ఉత్పత్తి జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

దేశంలో పాల ఉత్పత్తి:

దేశంలో పాల ఉత్పత్తి, వినియోగానికి సంబంధించిన వివరాల కోసం సంబంధిత కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, 2020-21 వార్షిక సంవత్సరంలో దేశంలో పాల ఉత్పత్తి మరియు వినియోగానికి సంబంధించిన వివరాలను భారత ప్రభుత్వం ఎకనామిక్ సర్వే 2021-22 పబ్లికేషన్లో వెల్లడించినట్టు తెలిసింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మరియు పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ (DAHD) తెలిపిన సమాచారం ప్రకారం 2020-21 వార్షిక సంవత్సరంలో దేశంలో మొత్తంగా 209.96 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే 2021-22లో తెలిపింది.

2022 సెప్టెంబర్ నెలలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పబ్లిష్ చేసిన ప్రెస్ రిలీజ్‌లో కూడా 2020-21 వార్షిక సంవత్సరంలో దేశంలో మొత్తంగా 209.96 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని స్పష్టం చేసింది. ఈ క్రమంగా 2020-21 వార్షిక సంవత్సరంలో దేశంలో మొత్తంగా 18,460.67 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి జరిగిందని తెలుస్తుంది. అంటే, 2020-21 వార్షిక సంవత్సరంలో ప్రతి రోజు సగటుగా 50.58 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి జరిగిందని ఎకనామిక్ సర్వే 2021-22 ద్వారా స్పష్టమవుతుంది.

దేశంలో పాల వినియోగం:

దేశంలో పాల వినియోగాన్ని తలసరి పాల లభ్యత ఆధారంగా లెక్కిస్తారు. 2020-21లో దేశంలో తలసరి రోజువారీ పాల లభ్యత 427 గ్రాములని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇవి కేవలం ప్రొవిషనల్ గణాంకాలు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం తమ ఎకనామిక్ సర్వే 2021-22 నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో పాల వినియోగానికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఏది అందుబాటులో లేదని ‘The Indian Express’ వార్తా సంస్థ 2022 అక్టోబర్ నెలలో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) గృహ వినియోగదారుల వ్యయం (HCE) 2011-12 సర్వే ప్రకారం, పాల యొక్క నెలవారీ తలసరి వినియోగం గ్రామీణ భారతదేశంలో 4.33 లీటర్లు మరియు పట్టణ భారతదేశంలో 5.42 లీటర్లు.

కల్తీ పాల వినియోగం:

దేశంలో కల్తీ పాల తయారీ, అమ్మకాలు, పట్టుబడటానికి సంబంధించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కల్తీ పాలు తయారుచేస్తున్న ముగ్గురు వ్యాపారులను ఫుడ్ సేఫ్టీ అధికారులు అరెస్ట్ చేశారు. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు దేశంలో ప్రతి రోజు 36 కోట్ల లీటర్ల పాలను కల్తీ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు.

భారతదేశంలో కల్తీ పాలు తాగడం వలన 87 శాతం ప్రజలు కాన్సర్ బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని తెలుపుతూ PIB ఫాక్ట్-చెక్ 18 అక్టోబర్ 2022 నాడు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అటువంటి సమాచారం విడుదల చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

చివరగా, దేశంలో పాల ఉత్పత్తి, వినియోగానికి సంబంధించి ఈ పోస్టులో షేర్ చేస్తున్న గణాంకాలు తప్పు

Share.

About Author

Comments are closed.

scroll