Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ లో భాగంగా భద్రాచలం అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది

0

‘2016లో మోదీ ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని రామాయణం సర్క్యూట్ లో చేర్చి ₹ 30 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం DPR ఇవ్వకుండా ఆ ఫండ్స్ ని వదులుకుందని’ . అలాగే ‘తెలంగాణ ముఖ్యమంత్రి KCR 2016లో భద్రాద్రికి ₹100 కోట్లు కేటాయిస్తానని చెప్పి ఇంతవరకు భద్రాద్రికి పైసా కూడా ఇవ్వలేదని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘2016లో మోదీ ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని రామాయణం సర్క్యూట్ లో చేర్చి ₹ 30 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం DPR ఇవ్వకుండా ఆ ఫండ్స్ ని వదులుకుంది’.

ఫాక్ట్ (నిజం): రామాయణ సర్క్యూట్ లో భాగంగా భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇదే విషయాన్నీ 2019లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (మినిస్టర్ అఫ్ స్టేట్ ఫర్ టూరిజం) రాజ్యసభలో ఒక ప్రశ్నకి సంబంధించి ఇచ్చిన జవాబులో స్పష్టం చేసారు. ఐతే ఇప్పటి వరకు రామాయణ సర్క్యూట్ కింద ఉత్తరప్రదేశ్ లోని రెండు ప్రాజెక్టులకి మాత్రమే నిధులు విడుదలయ్యాయి, ఇప్పటివరకైతే భద్రాచలం ఆలయానికి ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2016లో మోదీ ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని రామాయణం సర్క్యూట్ లో చేర్చి ₹ 30 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం DPR ఇవ్వకుండా ఆ ఫండ్స్ ని వదులుకుంది:

భారతదేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి మరియు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2014-15లో దేశంలో ‘థీమ్ బేస్డ్’ టూరిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధికి సంబంధించి ‘స్వదేశ్ దర్శన్’ అనే పథకాన్ని  ప్రారంభించింది. ఈ స్కీం ద్వారా కోస్టల్ సర్క్యూట్, వైల్డ్ లైఫ్ సర్క్యూట్, హిమాలయ సర్క్యూట్, కృష్ణ సర్క్యూట్, బౌద్ధ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్ మొదలైన 15 థీమ్ బేస్డ్ సర్క్యూట్లను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా స్వదేశ్ దర్శన్ పథకం ద్వారా టూరిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధి కోసం  2015-16 బడ్జెట్ లో ₹ 600 కోట్లు కేటాయించగా, అందులో సుమారు ₹ 310 కోట్లు ఖర్చు చేసారు.

స్వదేశ్ దర్శన్ పథకంలో భాగమైన రామాయణ సర్క్యూట్ కింద వివిధ రాష్ట్రాలలోని 15 ప్రాంతాలను గుర్తించి వాటిని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రామాయణ సర్క్యూట్ కింద గుర్తించిన 15 ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం కూడా ఒక్కటి. ఐతే, ఈ పథకంలో ప్రత్యేకించి రామాయణ సర్క్యూట్ కోసంగాని లేదా రామాయణ సర్క్యూట్ లో భద్రాచలం ప్రాంతానికి గాని ప్రత్యేకించి ఇంత ఖర్చు చేయాలనీ ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా ఇలా ప్రత్యేకించి ఒక్కో ప్రాంతానికి ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఖర్చు చేయాలనీ నిర్ణయించినట్టు తెలిపే ఎటువంటి సమాచరం మాకు లభించలేదు. సాధారణంగా ఈ పథకం కింద అభివృద్ధి చేయదలుచుకున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతిపాదనలకి అనుగుణంగా కేటాయింపులు జరుగుతాయి. 

స్వదేశ్ దర్శన్ వెబ్సైటులో ఈ పథకానికి సంబంధించి ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద అభివృద్ధి చేయాలనుకున్న ప్రాజెక్ట్ కి సంబంధించి మొదట డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకి సమర్పించిన తరవాత కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ ఆ DPRని సమీక్షించి నిధుల మంజూరికి ప్రతిపాదిస్తుంది.

ఐతే 2019లో తెలంగాణకి చెందిన పార్లమెంట్ సభ్యుడు డి. శ్రీనివాస్ రాజ్యసభలో తెలంగాణలో పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల గురించి అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (మినిస్టర్ అఫ్ స్టేట్ ఫర్ టూరిజం) జవాబిస్తూ తెలంగాణ ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ కింద భద్రాచలం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనని సమర్పించిందని తెలిపారు. దీన్నిబట్టి పోస్టులో చెప్తునట్టు భద్రాచలం అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనని సమర్పించలేదన్న వాదన నిజం కాదని అర్ధంచేసుకోవచ్చు.

పైగా ఇదే జవాబులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం అప్పటి వరకు మంజూరు చేసిన, విడుదల చేసిన నిధులకి సంబంధించిన వివరాలు కూడా తెలిపారు. ఐతే, ఈ వివరాలలో భద్రాచలానికి నిధులు మంజూరు చేసినట్టు ఎటువంటి ప్రస్తావన లేదు. అలాగే ఇటీవల మార్చ్ 2021లో లో సభలో ఒక పార్లమెంట్ సభ్యుడు రామాయణ సర్క్యూట్ కింద మంజురైన నిధుల గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (మినిస్టర్ అఫ్ స్టేట్ ఫర్ టూరిజం) ఇచ్చిన జవాబు ప్రకారం ఇప్పటి వరకు రామాయణ సర్క్యూట్ కింద కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్వదేశ్ దర్శన్ వెబ్సైటులో ఉన్న సమాచారం కూడా ఇదే చెప్తుంది. వీటన్నిటిని బట్టి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ కింద భద్రాచలానికి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి KCR 2016లో భద్రాద్రికి ₹100 కోట్లు కేటాయిస్తానని చెప్పి ఇంతవరకు భద్రాద్రికి పైసా కూడా ఇవ్వలేదు:

2016లో తెలంగాణ ముఖ్యమంత్రి భద్రాచలం సందర్శించిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం బడ్జెట్లో ₹100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కథనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే 2016-17 నుండి 2021-22 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో దేవాదాయ శాఖ కి సంబంధించి జీతాలు మొదలైన సాధారణ పద్దులు, బోనాలకు నిధులు కేటాయించిన మరియు ఇతర పద్దులు తప్ప భద్రాచలం ఆలయానికి ₹100 కోట్లు కేటాయించినట్టు ఎటువంటి సమాచారం లేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ₹100 కోట్లు విడుదల చేసినట్టు వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గానీ మాకు లభించలేదు.  వీటన్నిటిబట్టి, 2016 నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం ఆలయానికి ప్రత్యేకంగా ₹100 కోట్లు కేటాయించలేదని అర్ధంచేసుకోవచ్చు.

చివరగా, తెలంగాణ ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ లో భాగంగా భద్రాచలం అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనని సమర్పించింది.

Share.

About Author

Comments are closed.

scroll