Fake News, Telugu
 

నిద్రలో నుంచి అకస్మాత్తుగా లేవడం వల్ల మృత్యువు సంభవిస్తుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

రాత్రి పూట వాష్ రూంకి  వెళ్లాల్సి వస్తే, నిద్రలోనుండి ఆకస్మికంగా లేవడం వల్ల చాలా మంది నిద్రలో ప్రాణాలు కోల్పోతున్నారని, అలా అవడం నుండి తప్పించుకోవడానికి ఒక మూడున్నర నిమిషాల నియమాన్ని (అర నిమిషం అలాగే మంచంపై  ఉండాలి, ఇంకో అరనిమిషం కూర్చోవాలి, తరువాత రెండున్నర నిముషాల పాటు కాళ్ళు కిందకి వేస్కొని కూర్చున్న తర్వాత వాష్ రూంకి  వెళ్ళాలి) విరుగుడుగా సూచిస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఎంతో మనం ఈ పోస్ట్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రాత్రిపూట నిద్రలోంచి అకస్మాత్తుగా లేస్తే చనిపోతాము, అలా జరగడాన్ని ఆపడానికి ఈ మూడున్నర నిమిషాల చిట్కాని పాటించండి.

ఫాక్ట్ (నిజం): పొస్ట్‌లో చెప్తున్నట్లుగా, రాత్రి పూట నిద్ర మధ్యలో మంచంపై నుంచి అకస్మాత్తుగా లేవడం వల్ల చనిపోతాము అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కావున. పొస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

అసలు రాత్రి పూట మంచం పైనుండి అకస్మాత్తుగా లేవడం వల్ల చనిపోయే అవకాశం శాస్త్రీయంగా ఎంతవరకు సాధ్యం అని ఇంటర్నెట్‌లో వెతుకగా, సరైన ఆధారాలు లభించలేదు. కానీ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్  అనే ఒక కండిషన్ మాత్రమే పోస్టులో చెప్తున్న విషయానికి దెగ్గరగా ఉంది. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ యొక్క సాధారణ లక్షణం కూర్చుని లేదా పడుకున్న తర్వాత నిలబడి ఉన్నప్పుడు తల తిరగడం లేదా మబ్బుగా అనిపించడం. ఈ కండిషన్ యొక్క లక్షణాలని మీరు కింద చదవచ్చు.

బ్రిస్బేన్‌లోని ప్రిన్స్ చార్లెస్ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగానికి చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఇసురు రణసింగ్ AAP ఫ్యాక్ట్‌చెక్‌ వారితో మాట్లాడుతూ.  ‘హైపోటెన్షన్, తక్కువ రక్తపోటుతో తీవ్రమవుతుంది, వృద్ధులకు అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది, వారు పడిపోయినట్లయితే తీవ్రమైన గాయాలు అనుభవించే అవకాశం ఉంది’ అన్నారు. మాయోక్లినిక్ వారి ఈ ఆర్టికల్  తీవ్రమైన స్థితిలో వృద్ధులలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని రాసారు కానీ ఇది తీవ్రంమైన పరిస్థితిలోనే. ఇసురు రణసింగ్ AAP ఫ్యాక్ట్‌చెక్‌ వారితో  “రాత్రిపూట త్వరగా నిద్రలోనుండి లేవడం వలన ఆకస్మిక గుండె పోటుకి దారి తియ్యదు లేదా ECG నమూనాలో ఎటువంటి మార్పు ఉండదు,” అని చెప్పారు.

యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో కార్డియాక్ ఇమేజింగ్ ప్రొఫెసర్ మార్టిన్ ఉగాండర్ కూడా AAP ఫ్యాక్ట్‌చెక్‌ వారితో మాట్లాడుతూ ‘ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ వృద్ధులలో సర్వసాధారణంగా ఉంటుంది, ప్రత్యేకించి వారు రక్తపోటును తగ్గించే మందులు తీసుకుంటే.’ ‘వీరికి మంచిగా, నిదానంగా కూర్చోవాలని (డాక్టర్లు) సిఫార్సు చేస్తారు, ఒక సెకను లేదా రెండు సెకండ్లు వేచి ఉండమని, 30 సెకన్లు అనుకుందాం – మూడున్నర నిమిషాలు అనేది రాండమ్ సంఖ్య,’ అని చెప్పారు.

AFP వారు ఇదే విషయం పైన రాసిన ఫ్యాక్ట్‌చెక్‌ అర్టికల్‌లో డాక్టర్ బెర్నార్డ్ గితురా అనే కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ ‘పోస్ట్ తప్పుగా ఉంది మరియు సైన్స్‌లో దీనికి ఎటువంటి ఆధారాలు లేవు’ అని అన్నారు. “హఠాత్తుగా మేల్కొనడం వల్ల గుండె బలహీనపడదు లేదా మెదడులోని రక్త సరఫరా తగ్గిపోదు. ఎందుకంటే శరీరం ఒక సంక్లిష్టమైన నిర్మాణం కలిగి ఉంటుంది, ఒక వ్యక్తి నిద్రిస్తున్న స్థానం నుండి పైకి లేచినప్పుడు రక్తపోటు మరియు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఆ నిర్మాణం ఉపయోగపడుతుంది,” అని చెప్పారు.

ఈ ప్రక్రియ మొత్తం కొన్ని సెకన్లలో అయిపోతుందని, మూడున్నర నిముషాలు చాలా ఎక్కువ సమయం అని చెప్పారు.

చివరిగా, నిద్రలో నుంచి అకస్మాత్తుగా (త్వరగా) లేవడం (మేల్కొనడం) వల్ల మృత్యువు సంభవిస్తుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు..

Share.

About Author

Comments are closed.

scroll