Fake News, Telugu
 

నాభా జైలు నుండి విడుదలవడానికి బాండ్‌పై సంతకం చేయడం ద్వారా నెహ్రూ క్షమాపణలు చెప్పినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

నెహ్రూను, కె.సంతానం, ఇంకా ఎ.టి.గిద్వానిలతో బాటు 1923 సెప్టంబర్ 22న ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నాభా ప్రదేశంలోకి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రవేశించినందుకు బంధించడం జరిగింది. విచారణలో వారికి రెండేళ్ళ జైలుశిక్ష విధించబడింది. అయితే జైలు జీవనపు కష్టానికి బెదిరిపోయిన నెహ్రూ ‘ఇంకెప్పుడూ నాభా సరిహద్దులోకి నేను ప్రవేశించను ‘ అనే బాండ్ మీద సంతకం చేయడం ద్వారా క్షమాపత్రం వ్రాసి, జైలునుండి విడుదలయ్యాడు. తాను వ్రాసి ఇచ్చిన క్షమాపత్రం ప్రకారం తన జీవితంలో ఇంకెప్పుడూ నాభా సరిహద్దులోపలికి ప్రవేశించనేలేదు!…. నాభా జైలులో తాననుభవించిన కష్టాల వల్ల బాండ్ పై సంతకం చేసితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ స్వయంగా నెహ్రూ ఇలా వ్రాసుకున్నాడు ఆత్మకథలో. ‘నాభా జైలులో అతిచిన్న గదిలో మమ్మల్ని ఉంచారు. అందులో చెత్తా చెదారమంతా ఉంది. నేల తడిగా ఉంది. గదిపైకప్పు చేతులకు అందుతోంది. ఇవన్నీ చూశాక నేను ఆంగ్లేయులవద్ద క్షమాపణలు అడిగితీరాల్సిన పరిస్థితి వచ్చింది.’”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నాభా జైలు నుండి విడుదలవడానికి బాండ్‌పై సంతకం చేసి క్షమాపణలు అడిగితీరాల్సిన పరిస్థితి వచ్చిందని జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో రాసాడు. ‘ఇంకెప్పుడూ నాభా సరిహద్దులోకి నేను ప్రవేశించను’, అని బాండ్ మీద సంతకం చేసాడు.

ఫాక్ట్: నాభా జైలు నుండి విడుదలవడానికి బాండ్‌పై సంతకం చేసి క్షమాపణలు అడిగితీరాల్సిన పరిస్థితి వచ్చిందని జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో రాసినట్టు ఎక్కడా కనిపించలేదు, తన ఆత్మకథలో ఈ విషయం లేదు. ‘ఇంకెప్పుడూ నాభా సరిహద్దులోకి నేను ప్రవేశించను’, అని బాండ్ మీద తను సంతకం చేసినట్టు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బ్రిటీష్ వారి లేఖల్లో కూడా నెహ్రూ అలాంటి ఒక బాండ్ మీద సంతకం చేశాకే అతనిని విడుదులచేసినట్టు ఎక్కడా లేదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి జవహర్‌లాల్ నెహ్రూ యొక్క ఆత్మకథలో వెతకగా, నాభా జైలు నుండి విడుదలవడానికి బాండ్‌పై సంతకం చేసి క్షమాపణలు అడిగితీరాల్సిన పరిస్థితి వచ్చిందని తను రాసినట్టు ఎక్కడా కనిపించలేదు. నాభాలో తమపై పెట్టిన తప్పుడు కేసుల్లో విచారణ ముగిసాక, తమకు శిక్ష విధించబడిందని, అయితే ఆ రోజు సాయంత్రం జైలు సూపరింటెండెంట్ వచ్చి శిక్షలను సస్పెండ్ చేస్తూ అడ్మినిస్ట్రేటర్ యొక్క ఉత్తర్వును చూపించినట్టు నెహ్రూ తన ఆత్మకథలో రాసాడు. అంతేకాదు, ఎటువంటి షరతు జోడించబడలేదని కూడా ఆత్మకథలో  తెలిపాడు. అయితే, ఆ తరువాత “ఆ సూపరింటెండెంట్ అప్పుడు ప్రత్యేక అనుమతి లేకుండా రాష్ట్రానికి తిరిగి రాకూడదని మరియు నాభాను విడిచిపెట్టమని అడ్మినిస్ట్రేటర్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అనే ప్రత్యేక ఉత్తర్వును అందించాడు. నేను రెండు ఆర్డర్‌ల కాపీలను అడిగాను, కాని అవి తిరస్కరించబడ్డాయి. తర్వాత మమ్మల్ని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ విడుదల చేశారు”, అని చెప్తూ తన ఆత్మకథలో నెహ్రూ నాభా జైలు నుండి విడుదల గురించి రాసినట్టు ఇక్కడ చదవచ్చు.

జవహర్‌లాల్ నెహ్రూపై రాసిన ఇతర పుస్తకాల్లో కూడా నాభా జైలు నుండి విడుదలవడానికి నెహ్రూ బాండ్‌పై సంతకం చేసినట్టు ఎక్కడా లేదు. ఆ పుస్తకాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.

జవహర్‌లాల్ నెహ్రూ నాభా జైలులో ఉన్నప్పుడు మోతీలాల్ మరియు జవహర్‌లాల్ నెహ్రు మధ్య జరిగిన సంభాషణల వివరాలను ఈ పుస్తకంలో చదవచ్చు. నాభా కేసులకు సంబంధించి కోర్టులో నెహ్రూ చేసిన వ్యాఖ్యలు మరియు తను రాసిన ఉత్తరాలను ఇక్కడ చూడవచ్చు. ఒక వేళ పోస్ట్‌లో చెప్పినట్టు జైలు నుండి విడుదలవడానికి నిజంగానే నెహ్రూ బాండ్‌పై సంతకం చేస్తే, బయటికి వచ్చాక తమను బేషరతుగా విడుదల చేసి, కొత్తగా ఇప్పుడు షరతులు విధిస్తున్నారని నెహ్రూ అధికారులను ఎందుకు ప్రశ్నిస్తాడు? షరతులపై స్పష్టత కోసం సస్పెన్షన్ ఆర్డర్ తనకు పంపమని ఎందుకు కోరుతాడు?

అంతేకాదు, నెహ్రూకి నాభా అడ్మినిస్ట్రేటర్ రాసిన లేఖలో కూడా పోస్ట్‌లో చెప్పిన బాండ్‌ గురించి ప్రస్తావించలేదు. వారికి పడిన శిక్ష సస్పెండ్ మాత్రమే చేయబడిందని, అనుమతి లేకుండా నాభాకి తిరిగి వస్తే శిక్ష అమలు చేయబడుతుందని మాత్రం చెప్పినట్టు ఇక్కడ చదవచ్చు.

ఆ కేసుకు సంబంధించి ఉన్న అధికారాక ఉత్తరాల్లో కూడా పోస్ట్‌లో చెప్పిన బాండ్‌ గురించి లేన్నట్టు ‘నాభా అఫైర్స్’ డాక్యుమెంట్‌లో చూడవచ్చు. వారు విడుదల అయ్యాక కొంత సమయానికి గిద్వాని మళ్ళీ నాభాకి వెళ్లి అరెస్ట్ అవ్వడం, ఆ సమయంలో నెహ్రూ అక్కడకి వెళ్లాలి అనుకున్నా, తరువాత మానుకోవడం వంటి ఇతర వివరాలు కోసం పైన ఇచ్చిన వివిధ పుస్తకాల్లో వివరంగా చదవచ్చు.

చివరగా, నాభా జైలు నుండి విడుదలవడానికి బాండ్‌పై సంతకం చేయడం ద్వారా నెహ్రూ క్షమాపణలు చెప్పినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

అప్డేట్ (31 మార్చి 2023):

నాభా జైలులో ఉన్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ తన తండ్రికి రాసిన లేఖలో తనకు భయం వేస్తుందని, తన గదిలో ఎలుక పరిగెడుతుందని, ఎలాగైనా తనని బయటికి తీసుకొని వెళ్ళమని అడిగినట్టు చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే, పోస్టులో చెప్పినట్టు తనకి భయం వేస్తుందని, ఎలాగైనా తనని బయటికి తీసుకొని వెళ్ళమని జవహర్‌లాల్ నెహ్రూ తన తండ్రి మోతీలాల్ నెహ్రూకు లేఖ రాయలేదు. వీడియోలో చూపిస్తున్న పుస్తకంలో అలాంటి ఉత్తరం గురించి ఏమీ లేదు. తన తండ్రి జోక్యంతో జవహర్‌లాల్ నెహ్రూకి చికాకు వచ్చిందని ఆ పుస్తకంలో చదవచ్చు. ఆ పుస్తకంలో నెహ్రు తన తండ్రికి రాసిన లేఖకు సంబంధించిన వివరాలు ఇక్కడ చదవచ్చు.

నాభా జైలులో ఉన్నప్పుడు మోతీలాల్ మరియు జవహర్‌లాల్ నెహ్రు మధ్య జరిగిన సంభాషణల గురించి ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు. అయితే, నాభా జైలులోని గది శుభ్రంగా లేదని, నేలపై పడుకున్నప్పుడు ఎలుక తన ముఖం మీది నుండి వెళ్లిందని మాత్రం తన ఆత్మకథలో జవహర్‌లాల్ నెహ్రు రాసాడు. కాబట్టి, నాభా జైలులో ఉన్నప్పుడు జవహర్‌లాల్ తనకు భయం వేస్తుందని, ఎలాగైనా తనని బయటికి తీసుకొని వెళ్ళమని తన తండ్రికి లేఖ రాయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll