Fake News, Telugu
 

‘బిస్తర్’ పట్టుకొని రెడీ ఉండండని యువతకి బండి సంజయ్ పిలుపునిచ్చాడు; ‘పిస్తోల్’ కాదు

0

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, “యువతకు అపీల్ చేస్తున్నా. పిస్తోల్ పట్టుకొని రెడీ ఉండండి అన్నా. తమ్ముడు యుద్ధం స్టార్ట్ అయింది ఇవాళ. ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయాల చాలా తప్పు చేసాడు”, అని అన్నాడని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పిస్తోల్ పట్టుకొని రెడీ ఉండండని యువతకి పిలుపునిచ్చిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

ఫాక్ట్: బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా వింటే, తను ‘బిస్తర్’ (‘పిస్తోల్’ కాదు) పట్టుకొని రెడీ ఉండండని యువతకి పిలుపునిచ్చినట్టు వినవచ్చు. ‘బిస్తర్’ అంటే పడుకోవడానికి ఉపయోగించేది. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో మంగళవారం (23 ఆగస్టు 2022) నాడు బండి సంజయ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌కి సంబంధించినట్టు తెలిసింది. ఆ ప్రెస్ మీట్‌కి సంబంధించిన వీడియోలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా వింటే, తను ‘బిస్తర్’ (‘పిస్తోల్’ కాదు) పట్టుకొని రెడీ ఉండండని యువతకి పిలుపునిచ్చినట్టు వినవచ్చు. ‘బిస్తర్’ అంటే పడుకోవడానికి ఉపయోగించేది. ఆ ప్రెస్ మీట్‌లో వేరే దగ్గర కూడా – “మాకు సహకరించండి. బిస్తర్ పట్టుకొని రండి. వారం రోజుల పాటు రండి” అని అన్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియో స్పీడ్ తక్కువ చేసి వినగా, తను అన్నది ‘బిస్తర్’ అనే వినిపిస్తుంది

బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి – తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు!” అంటూ వివిధ వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, ఇంతకముందు కూడా ‘బిస్తర్’ అనే పదాన్ని బండి సంజయ్ వాడినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

బండి సంజయ్ అన్నది ‘బిస్తర్’ అని, ‘పిస్తోల్’ కాదని చెప్తూ బీజేపీ తెలంగాణ వారు కూడా తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసారు.

చివరగా, ‘బిస్తర్’ పట్టుకొని రెడీ ఉండండని యువతకి బండి సంజయ్ పిలుపునిచ్చాడు; ‘పిస్తోల్’ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll