‘ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో రోడ్డుపై బండి ఏర్పాటు చేసిన హిందూ మహిళను ఓ ముస్లిం బాలుడు చంపేస్తానని బెదిరిస్తున్న వీడియో’ అంటూ ఓ యువకుడు ఒక మహిళకు కత్తి చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో రోడ్డుపై బండి ఏర్పాటు చేసిన హిందూ మహిళను ఓ ముస్లిం బాలుడు చంపేస్తానని బెదిరిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ సంఘటన 22 సెప్టెంబర్ 2024న ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగింది. ఇందులో ఎలాంటి మత కోణం లేదు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని రాకేష్‌గా గుర్తించారు. బాధితురాలు మరియు ముగ్గురు నిందితులు ఒకే మతానికి చెందినవారు (హిందూ). ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది, ఇద్దరు నిందితులను అరెస్టు కూడా చేశారు, వారిలో ఒకరు మైనర్. మూడో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడంలో, న్యూస్18 తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 3 అక్టోబర్ 2024న ప్రచురించిన వార్తలను మేము కనుగొన్నాము. దీని ప్రకారం, ఈ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో 22 సెప్టెంబర్ 2024న జరిగింది. సుల్తాన్‌పురి మార్కెట్‌లో పట్టపగలు ఓ మహిళకు కత్తి చూపించిన ఘటన వైరల్‌గా మారిందని, దీనిపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారని వీడియో వివరణలో పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు, వారిలో ఒకరు మైనర్ కాగా, ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.

తదుపరి, సుల్తాన్‌పురిలోని DDA మార్కెట్ నుండి మమతా దేవి అనే 28 ఏళ్ల షాప్ యజమానికి సంబంధించిన వైరల్ వీడియో గురించి అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) కనుగొన్నాం. ముగ్గురు నిందితుల్లో ఒకరిని 19 ఏళ్ల రాకేష్‌గా గుర్తించారు. ఈ కథనాల ప్రకారం, మమత ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు, మూడవ వ్యక్తిని పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.

దీని గురించి మరింత వెతికితే, ఔటర్ ఢిల్లీ DCP యొక్క అధికారిక X హ్యాండిల్‌కు దారితీసింది. ఈ పోస్టు ప్రకారం రాజ్ పార్క్ పోలీసులు ఒక బండి పై వ్యాపారం చేసుకుంటున్న మహిళను కత్తితో బెదిరించిన సంఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. BOOM సంస్థ వారు సుల్తాన్‌పురి ప్రాంతంలోని రాజ్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వీరేంద్ర సింగ్ సంప్రదించి, ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని, బాధితురాలు మరియు ముగ్గురు నిందితులు ఒకే మతానికి చెందినవారు (హిందూ) అని స్పష్టం చేశారు. ఈ కేసు పై నమోదు చేసిన FIRను పరిశీలించి నిందితులు మరియు బాధితురాలు ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందినవారని మరియు ఈ దాడి వెనుక ఎటువంటి మతపరమైన ఉద్దేశ్యం లేదని తెలుసుకున్నాము.

చివరిగా, ఢిల్లీలో ఒక యువకుడు కత్తితో మహిళను బెదిరించిన సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు.