Fake News, Telugu
 

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు

0

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఉద్యోగులు అలా చేయకపోతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం ద్వారా వచ్చే సదుపాయాలు వదులుకోవాల్సి వస్తుందని ఈ పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని, లేకపోతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఫాక్ట్: ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. 2022లో కూడా ఇదే ఫేక్ పోస్టు యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ పేరు మీద కూడా వైరల్ అయ్యింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ముందుగా ఇంటర్నెట్‌లో వెతకగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువంటి ఆదేశాలు జారీ చేశారని ఎక్కడా కూడా సమాచారం లభించలేదు. ఒకవేళ నిజంగానే అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటే, అన్ని వార్తా సంస్థలు దాని గురించి రిపోర్ట్ చేసేవి.

ఇక ఇదే విషయం గురించి ప్రభుత్వ వెబ్‌సైట్లలో వెతకగా, ప్రభుత్వం దీనికి సంబంధించిన ఎటువంటి జీవోని గానీ అధికారిక ప్రకటన గానీ చేసినట్లు ఆధారాలు లేవు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టినట్లు కూడా ఆధారాలు లేవు.

అంతే కాదు, ఇటీవల విద్యా శాఖ మీద జరిగిన సమీక్షా సమావేశంలో కూడా దీని గురుంచి చర్చించినట్టు ఎక్కడా అధికారిక సమాచారం లేదు.

ఇక వైరల్ పోస్టులోని వాక్యాలను గమనించగా, అచ్చం ఇలాంటి పోస్టు 2021 నుంచి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మీద వైరల్ అయ్యిందని గుర్తించాం. అది తప్పుడు సమాచారమని నిరూపిస్తూ ఏప్రిల్ 2022లో FACTLY ఒక ఫాక్ట్-చెక్ కథనాన్ని ప్రచురించింది. ఇదే ఫేక్ పోస్టు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మీద మళ్ళీ ప్రచారమవుతోంది.

చివరిగా, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll