Fake News, Telugu
 

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయలేదు

0

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీచేసారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఉద్యోగులు అలా చేయకపోతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం ద్వారా వచ్చే సదుపాయాలు వదులుకోవాలని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసారు.

ఫాక్ట్: ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2018లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉపాధ్యాయులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.           

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అటువంటి ఆదేశాలు జారీచేసారని ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లలను రాష్ట్ర ప్రాథమిక పాఠశాలలకు పంపేలా ఆరు నెలల్లోగా విధివిధానాలను రూపొందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అలహాబాద్ హైకోర్టు 2015లోనే ఆదేశించింది. అప్పట్లో జస్టిస్ సుధీర్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి సెషన్ నుండి తన ఆర్డర్ అమలులోకి రావాలని పేర్కొంటూ, ఆరు నెలల్లోగా నివేదికను కోర్టు కోరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడైతే ప్రభుత్వం అటువంటి ఆదేశాలు జారీ చేసినట్టు ఎక్కడా న్యూస్ ఆర్టికల్స్ లేవు.

2018లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉపాధ్యాయులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఇలా చేస్తే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే విశ్వాసం ఇతరులకు కలుగుతుందని సీఎం అన్నారు.

చివరగా, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll