Fake News, Telugu
 

సంపాదనకు, సంతోషానికి వ్యత్యాసాన్ని తెలుపుతున్న ఈ సందేశాన్ని స్టీవ్ జాబ్స్ ఇవ్వలేదు

0

ఆపిల్ కో-ఫౌండర్, మాజీ CEO స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు ఇచ్చిన చివరి సందేశం, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. “పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం. కానీ, పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది. నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు కానీ, నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు కానీ, ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు”, అని స్టీవ్ జాబ్స్ తన చివరి సందేశంలో  పేర్కొన్నట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. అంతేకాదు, జీవితంలో ప్రతి ఒక్కరు పాటించవలిసిన అయిదు సూత్రాలని స్టీవ్ జాబ్స్ తన చివరి సందేశంలో తెలిపినట్టు ఈ పోస్టులో తెలిపుతున్నారు. పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా వుండటం ఎలాగో నేర్పించాలని, ఆహారాన్ని ఔషధంగా వాడాలి లేకపోతే ఔషధాలు ఆహారమవుతుందని, వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా వెళ్లు కానీ, దూరం వెళ్లాలంటే కలిసి వెళ్ళాలని స్టీవ్ జాబ్స్ తన ఆఖరి సందేశంలో తెలిపినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు ఇచ్చిన చివరి సందేశం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలుపుతున్న ఈ సందేశాన్ని స్టీవ్ జాబ్స్ ఇవ్వలేదు. ఈ సందేశం ఇంటర్నెట్లో కనీసం 2015 నుండి షేర్ అవుతుంది. స్టీవ్ జాబ్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వాల్టర్ ఇస్సాక్సన్ రాసిన స్టీవ్ జాబ్స్ బైయోగ్రఫి పుస్తకంలో ఎక్కడా తెలుపలేదు. స్టీవ్ జాబ్స్ తను చనిపోయేముందు “ఓ వావ్, ఓ వావ్, ఓ వావ్” అని మాట్లాడినట్టు స్టీవ్ జాబ్స్ సోదరి తెలిపింది. సోషల్ మీడియాలో స్టీవ్ జాబ్స్ చివరి మాటలగా షేర్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా స్పష్టం చేసాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఆపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అరుదైన పాన్క్రియాటిక్ కాన్సర్‌తో బాధపడుతూ 05 అక్టోబర్ 2011 నాడు మరణించారు. అయితే, పోస్టులో షేర్ చేసిన మెసేజ్ 2015 నుంచి ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. ఒకవేళ స్టీవ్ జాబ్స్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, ఈ సందేశం 2011 నుంచే ఇంటర్నెట్లో వైరల్ అయి ఉండేది.  

ఈ పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు మాట్లాడిన చివరి మాటల ఏమిటని ఇంటర్నెట్లో వెతికితే, స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు మాట్లాడిన చివరి మాటలను అతని సోదరి మోనా సింప్సన్ 2011లోనే బహిర్గతం చేసినట్టు తెలిసింది. స్టీవ్ జాబ్స్ చనిపోయేముందు చివరగా  “ఓ వావ్, ఓ వావ్, ఓ వావ్” అని మాట్లాడినట్టు మోనా సింప్సన్ తన సోదరుడి స్మారక కార్యక్రమంలో తెలిపింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రను తెలుపుతూ వాల్టర్ ఇస్సాక్సన్ రాసిన బైయోగ్రఫి పుస్తకంలో కూడా జాబ్స్ పోస్టులో తెలుపుతున్న సందేశాన్ని ఇచ్చినట్టు ఎక్కడా తెలుపలేదు. అయితే, స్టీవ్ జాబ్స్ వాల్టర్ ఇస్సాక్సన్‌కి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో తన ఆఖరి కోరిక గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. “నా పిల్లలు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను వారి కోసం ఎల్లపుడూ అందుబాటులో లేను. కాని, నేను చేసే పని గురించి, నేను వారికి ఎందుకు అందుబాటులో ఉండలేకపోయానో వారు అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను”, అని స్టీవ్ జాబ్స్ తెలిపారు. మీకు పిల్లలు ఉన్నందుకు సంతోషిస్తున్నారా? అని అడిగిన ఒక ప్రశ్నకు, “నేను ఇప్పటివరకు చేసిన దానికంటే అది 10,000 రెట్లు మెరుగైనది”, అని స్టీవ్ జాబ్స్  సమాధానమిచ్చారు. కాని, పోస్టులో తెలుపుతున్న సందేశాన్ని స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు ఎవరూ రిపోర్ట్ చేయలేదు.

స్టీవ్ జాబ్స్ చివరి సందేశంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని పలు అంతార్జతియ వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సంపాదనకు, సంతోషానికి వ్యత్యాసాన్ని తెలుపుతూన్న ఈ సందేశాన్ని స్టీవ్ జాబ్స్ ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll