Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లో ముస్లింలు గోశాలపై దాడి చేసి ఆవులను చంపారని పేర్కొంటూ జలంధర్‌లో ఎద్దుపై జరిగిన దాడి వీడియోను షేర్ చేస్తున్నారు

0

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కేసులో 25 నవంబర్ 2024న, ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే, బంగ్లాదేశ్‌లోని హిందువులు మరియు ఇతర మైనారిటీలపై, వారి మత స్థలాలపై దాడులు జరిగుతున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “బంగ్లాదేశ్‌లో గోశాలపై ముస్లింలు దాడి చేసి ఆవులను చంపారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లోని ఓ గోశాలపై ముస్లింలు దాడి చేసి ఆవులను చంపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఎద్దును దారుణంగా కొడుతున్న ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వైరల్ వీడియో పంజాబ్‌లోని జలంధర్‌లోని డెయిరీ ఫామ్‌లో కొంతమంది డెయిరీ కార్మికులు ఎద్దును క్రూరంగా కొట్టిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ వైరల్ వీడియోకు సంబంధించి సదర్ జలంధర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయబడింది. సదర్ జలంధర్ పోలీస్ స్టేషన్ SHO మాతో మాట్లాడుతూ, “ఈ వీడియో దాదాపు రెండేళ్ల నాటిదని వారి ప్రాథమిక విచారణలో తేలిందని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది” అని పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వైరల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వినయ్ కపూర్3930’ అనే యూజర్ 14 నవంబర్ 2024న షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేసినట్లు గుర్తించాము. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌ నగరం పరిధిలోని జంషెర్ డైరీలో జరిగింది.

ఈ క్రమంలోనే, మేము 19 నవంబర్ 2024న X (ట్విట్టర్)లో ఇదే వైరల్ వీడియోను షేర్ చేసిన మరో పోస్టును (ఆర్కైవ్డ్ లింక్) కనుగొన్నాము. ఈ పోస్ట్‌లో ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలను  పేర్కొనలేదు. అయితే, ఈ పోస్టుపై PETA INDIA స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్), “ఈ ఘటనకు సంబంధించి, భారతీయ శిక్షాస్మృతి(BNS) సెక్షన్ 325 మరియు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (PCA) సెక్షన్ 11 కింద సదర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే  FIR నమోదు చేయబడింది” అని  పేర్కొంది.

ఈ సమాచారం ఆధారంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఇదే వైరల్ వీడియోను రిపోర్ట్ చేస్తూ ‘ఖబ్రిస్తాన్‌పంజాబీ’ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఒక వార్తా కథనాన్ని కనుగొన్నాము. ఈ కథనం ప్రకారం, వీడియోలోని సంఘటన పంజాబ్‌, జలంధర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో జరిగింది. అలాగే, 20 నవంబర్ 2024న ‘ది ట్రిబ్యూన్‘ ప్రచురించిన వార్తాకథనం యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ (Animal Protection Foundation)  అనే జంతు రక్షణ సంస్థ నాయకుడు శ్రీస్ట్ బక్షి, వైరల్ వీడియోలో చూపిన సంఘటనపై ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు అని పేర్కొంది. ఈ కథనం కూడా ఈ ఘటన జలంధర్‌లోని జరిగింది అని పేర్కొంది.

తదుపరి మేమే పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న జంతు రక్షణ సంస్థ ‘Animal Protection Foundation’  యొక్క Facebook పేజీని కనుగొన్నాము. ఈ పేజీ ఇదే వైరల్ వీడియోను 13 నవంబర్ 2024న షేర్ చేసిందని మేము కనుగొన్నాము. మరొక పోస్ట్‌లో, ఈ సంఘటనకు సంబంధించి సంస్థ సభ్యులు స్థానిక DSPని కలిశారని పేర్కొన్నారు. అలాగే మరో పోస్టులో స్థానిక DSPతో ‘Animal Protection Foundation’ సంస్థ అధ్యక్షుడి సమావేశానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అలాగే పోలీసులకు ఈ సంస్థ ఇచ్చినా ఫిర్యాదు యొక్క కాపీ, ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన FIR కాపీని కూడా షేర్ చేశారు.  

దీని ఆధారంగా పంజాబ్ పోలీస్ వెబ్‌సైట్ నుండి ఈ వైరల్ వీడియోకు సంబంధించి సదర్ జలంధర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR (0228/2024)ని పరిశీలించాము. జలంధర్‌లోని జంషెర్ ప్రాంతంలోని ఘుమాన్ డైరీ ఫామ్‌ (Ghuman Dairy Farm) లో ఈ ఘటన జరిగిందని, నిందితులకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదని FIR లో పేర్కొన్నారు. ఈ వివరాలను బట్టి ఈ వైరల్ వీడియో పంజాబ్‌లోని జలంధర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో జరిగిన ఘటనను చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ ఘటనకు సంబంధించి  మరింత సమాచారం కోసం మేము ఈ వీడియోపై ఫిర్యాదు చేసిన జలంధర్‌లోని యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్‌కు చెందిన శ్రీష్ట్ భక్షి అలియాస్ యువీ సింగ్‌ను సంప్రదించాము. మాతో మాట్లాడుతూ, “పంజాబ్‌లోని జలంధర్‌లోని జంషెర్ డెయిరీ కాంప్లెక్స్ అనే ఫామ్‌లో నలుగురు వ్యక్తులు ఎద్దును క్రూరంగా కొట్టడం వీడియోలో ఉందని, తమ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, ఈ ఘటనకు సంబంధించి నిందితులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని” ఆయన పేర్కొన్నారు.

అలాగే మేము సదర్ జలంధర్ పోలీస్ స్టేషన్ SHOతో కూడా మాట్లాడాం. SHO సురేష్ కుమార్ మాతో మాట్లాడుతూ, “మా ప్రాథమిక విచారణలో, ఈ వీడియో దాదాపు రెండు సంవత్సరాల నాటిదని, ఆ ఎద్దు డెయిరీ ఫామ్ కార్మికులలో ఒకరిపై దాడి చేయగా, డెయిరీ ఫామ్ కార్మికులలో కొంతమంది ఆ ఎద్దుపై దాడి చేశారని డెయిరీ ఫామ్ యజమాని చెప్పినట్లు, ఇంకా  విచారణ కొనసాగుతోందని, నిందితుల ఇంకా తెలియాల్సి ఉంది” అని పేర్కొన్నారు.

చివరగా, ఎద్దును దారుణంగా కొడుతున్న ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వైరల్ వీడియో జలంధర్‌లోని డెయిరీ ఫామ్‌లో కొంతమంది డెయిరీ కార్మికులు ఎద్దును క్రూరంగా కొట్టిన దృశ్యాలను చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll