Fake News, Telugu
 

కోవిడ్-19 వైరస్ కాదు, బాక్టీరియా అని చెప్తూ సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాఖ్యలు చేయలేదు.

0

సింగపూర్ వాళ్ళు కోవిడ్-19ని వైరస్ కాదు, కేవలం రేడియేషన్‌కు గురైయ్యే బాక్టీరియా అని, ఆస్ప్రిన్ ద్వారా రోగం నయం చేయొచ్చని అంటున్నారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కోవిడ్-19 వైరస్ కాదు, బాక్టీరియా; దాన్ని ఆస్ప్రిన్ ద్వారా నయం చేయొచ్చని అంటున్న సింగపూర్.

ఫాక్ట్: కోవిడ్-19 గురించి పోస్టులో చెప్పిన విషయాలను సింగపూర్ వెల్లడించలేదు. కోవిడ్-19 వ్యాధి SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుంది. కోవిడ్-19ని నయం చేయడానికి ఆస్ప్రిన్ వాడితే సరిపోతుందని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైటులో గాని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటులో గాని ఎక్కడా కూడా లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో సింగపూర్ కోవిడ్-19ని వైరస్ కాదు, బాక్టీరియా అని అంటుంది అని ఉంది. కానీ, సింగపూర్ కి సంబంధించిన ‘Ministry of Health’ (ఆరోగ్య మంత్రిత్వ శాఖ) వెబ్సైటులో కోవిడ్-19 వ్యాధి SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుందని ఉంది. 

కోవిడ్-19ని నయం చేయడానికి ఆస్ప్రిన్ వాడితే సరిపోతుందని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైటులో ఎక్కడా లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటులో కూడా ఆస్ప్రిన్ నయం చేస్తుందని ఎక్కడా లేదు.

పోస్టులో కోవిడ్-19 మృతదేహాలకు శవపరీక్ష జరపకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా ఉంది. అయితే, అటువంటి మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి సంబంధించి శీర్షిక విడుదల చేసింది. శవపరీక్ష నిర్వహించేటప్పుడు భద్రతా చర్యల జాబితాను అనుసరించాలని సూచించడాన్ని చూడవచ్చు.

అంతేకాక, కేంద్ర ప్రభుత్వ అధికారిక పౌర సమాచార శాఖ, PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వారు కూడా COVID-19 ని ఆస్ప్రిన్ నయం చేస్తుంది అని ఉన్న మెసేజ్ ఫేక్ అని ట్వీట్ చేసింది.

జూన్ 2020లో కూడా కోవిడ్-19ని వైరస్ కాదు బాక్టీరియా, దాన్ని ఆస్ప్రిన్ ద్వారా నయం చేయొచ్చని అంటున్న ఇటలీ అని ఒక పోస్ట్ బాగా వైరల్ అయ్యింది; అది తప్పు అని చెప్తూ FACTLY ఒక ఆర్టికల్ రాసింది.

చివరగా, కోవిడ్-19పై ఇటువంటి చికిత్స విధానాలను మరియు అది వైరస్ కాదు బాక్టీరియా అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పలేదు.

Share.

About Author

Comments are closed.

scroll