Fake News, Telugu
 

సుభాష్ చంద్రబోస్ భారతీయ పౌరుడే కాదంటూ ఒక న్యాయవాది రాసిన లేఖను నెహ్రూ రాసాడంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

జవహర్ లాల్ నెహ్రూ నేతాజీని అసలు భారతీయుడే కాదని నిర్దారించినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ వాదనకి మద్దతుగా నేతాజీని అసలు భారతీయుడే కాదని నెహ్రూ రాసాడని చెప్తున్న ఒక డాక్యుమెంట్‌ ఫోటోని షేర్ చేసారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: జవహర్ లాల్ నెహ్రు నేతాజీని అసలు భారతీయుడే కాదని నిర్దారించిన డాక్యుమెంట్.

ఫాక్ట్(నిజం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై 1999లో అప్పటి ప్రభుత్వం ఒక న్యాయ విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేయబోతుందని ప్రకటించిన నేపథ్యంలో బిజన్ ఘోష్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్.కే. అద్వానికి రాసిన లేఖలో బోస్‌ని భారతీయుడు కాడు అని సంబోధించాడు. వైరల్ ఫోటో ఈ లేఖలోని భాగమే. బోస్ భారతీయుడు కాదంటూ బిజన్ ఘోష్ అనే న్యాయవాది రాసిన లేఖను నెహ్రూ రాసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో నేతాజీని అసలు భారతీయుడే కాదని పేర్కొన్న డాక్యుమెంట్‌కి నెహ్రూకి ఎటువంటి సంబంధంలేదు. ఈ డాక్యుమెంట్ నెహ్రూ రాయలేదు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై 1999లో అప్పటి ప్రభుత్వం ఒక న్యాయ విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేయబోతుందని ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో బిజన్ ఘోష్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్.కే. అద్వానికి ఒక లేఖ రాసాడు. ఈ లేఖలో ఆ న్యాయవాది బోస్‌ని భారతీయుడు కాడు అని సంబోధించాడు. పోస్టులో షేర్ చేసిన డాక్యుమెంట్ ఈ లేఖ నుండి సేకరించిందే. బోస్‌కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన రహస్య పత్రాలలో ఈ డాక్యుమెంట్ కూడా ఉంది. నేతాజీ పేపర్స్ వెబ్సైటులో ఈ డాక్యుమెంట్ ఉంది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అల్లైడ్ ఫోర్సెస్‌కి వ్యతిరేకంగా బోస్ ఆక్సిస్ పవర్స్‌కి మద్దతు తెలిపినందుకు ఐక్యరాజ్యసమితి బోస్‌ని వార్ క్రిమినల్‌గా ప్రకటించిందని ఈ లేఖాలో బిజన్ ఘోష్ పేర్కొన్నాడు. ఇదే లేఖలో భారత రాజ్యాంగంలోని పార్ట్-2 ప్రకారం సుభాష్ చంద్రబోస్ అసలు భారతీయుడే కాదని కూడా పేర్కొన్నాడు. దీన్నిబట్టి, బోస్ అసలు భారతీయుడే కాదంటూ ఒక న్యాయవాది రాసిన లేఖను నెహ్రూ రాసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, సుభాష్ చంద్రబోస్ భారతీయుడే కాదంటూ ఒక న్యాయవాది రాసిన లేఖను నెహ్రూ రాసాడంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll