Fake News, Telugu
 

కోవిడ్ వాక్సిన్‌ల దుష్ప్రభావాలు వివరాలను మొదటి నుంచే WHO, CDC, వ్యాక్సిన్‌ తయారీ సంస్థల వెబ్‌సైట్లలో వెల్లడించారు

0

కోవిడ్ వ్యాక్సిన్‌ల వలన ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి అని ఒక RTI పిటిషన్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టుని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కోవిడ్ వ్యాక్సిన్‌ల వలన ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి అని ఒక RTI పిటిషన్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఫాక్ట్: WHO, CDC మరియు వాక్సిన్‌  తయారీ సంస్థలు ఇదివరకే వెల్లడించిన వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు వివరాలు మాత్రమే  RTI సమాధానంలో పేర్కొన్నారు. ICMR, CDSCO వ్యాక్సిన్‌ల దుష్ప్రభావాల పైన ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించే అంశంలో కోవిడ్-19 టీకా సహాయపడిందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి.  వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలతో పోల్చిచూస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా పోస్టులో చెప్పిన వివరాల ప్రకారం, కొవిషీల్డ్, కోవోవాక్స్, కోవాక్సిన్, సుత్నిక్-వి వంటి వ్యాక్సిన్‌ల లాభ నష్టాల వివరాలను చెప్పాలంటూ దాఖలైన RTI పిటిషన్ కు సమాధానంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ (CDSCO) సంస్థలకు చెందిన అధికారులు ఆయా వ్యాక్సిన్స్ కి సంబంధించిన FAQs సమాచారాన్ని వెల్లడించారని, ఈ సమాచారంలో వాక్సిన్‌ల దుష్ప్రభావాల వివరాలు ఉన్నాయి అని పోస్టులో చెప్పబడింది. అయితే ప్రభుత్వం ఏదో కొత్త వివరాలను బయటపెట్టింది అని ఇదే వార్త వైరల్ అవుతుండటంతో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 17 జనవరి 2023న మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవ విరుద్ధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి అని వివరణ ఇచ్చింది.

మరియు WHO, CDC, Ministry of Health, Serum Institute, Bharat Biotech మొదలగు వెబ్‌సైట్లలో వ్యాక్సిన్‌ల వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వాటి తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాక్సిన్‌ నాణ్యత తదితర అంశాల గురించి ఇది వరకే సమాచారం అందుబాటులో ఉంది. ఈ సమాచారం చాలా రోజుల ముందు నుండే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైటులో అందుబాటులో ఉంది.

చివరిగా, WHO, CDC మరియు వాక్సిన్‌  తయారీ సంస్థలు ఇదివరకే వెల్లడించిన వ్యాక్సిన్‌ దుష్ప్రభావాల వివరాలు మాత్రమే RTI సమాధానంలో పేర్కొన్నారు. ICMR, CDSCO వ్యాక్సిన్‌ల దుష్ప్రభావాలపైన ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll