Fake News, Telugu
 

షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ హజ్ యాత్రికులకు ఎటువంటి విరాళం ఇవ్వలేదు

0

వివరణ (23 June 2023): 20 జూన్ 2023న షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు హజ్ యాత్రికులకు తమ ట్రస్ట్ విరాళాలు ఇస్తుందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై షిరిడీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. షిర్డీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు హజ్ యాత్రికులకు ₹35 కోట్లు విరాళం ఇచ్చారని, అయితే అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు హజ్ యాత్ర చేసే ముస్లింలకు ₹35 కోట్లు విరాళం ఇచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎటువంటి విరాళం ఇవ్వలేదు.

ఫాక్ట్: షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ హజ్ యాత్రికులకు ఎటువంటి విరాళం ఇవ్వలేదని అప్పటి ట్రస్ట్ సి.ఈ.ఓ రాహుల్ జాదవ్ స్పష్టం చేశారు. అలాగే, అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎవరూ తమని విరాళాలు కోరలేదని, కాబట్టి ట్రస్ట్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ విషయంపై ఇంటర్నెట్లో వెతకగా షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు హజ్ యాత్రకు విరాళం ఇచ్చినట్లు ఎక్కడా వార్తా కథనాలు లభించలేదు. ఒకవేళ నిజంగానే విరాళం ఇచ్చి ఉంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు ఈ వార్తను ప్రచురించేవి. షిరిడీ ట్రస్ట్ యొక్క అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్‌లలో మరియు వెబ్‌సైటులో కూడా హజ్ యాత్రికులకి ₹35 కోట్లు విరాళం ఇచ్చినట్లు పేర్కొనలేదు. ఇక, ఏప్రిల్ 2023లో ఈ పుకారు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉండటంతో, అప్పటికి ట్రస్ట్ సి.ఈ.ఓ రాహుల్ జాదవ్ ఈ విషయంపై స్పందిస్తూ హజ్ యాత్రకు ట్రస్ట్ ఎటువంటి విరాళం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

అలాగే, రామమందిర నిర్మాణానికి ఎవరూ తమని విరాళాలు కోరలేదని, కాబట్టి ట్రస్ట్ నియమాల ప్రకారం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకునే సౌలభ్యం లేదని ఆయన పేర్కొన్నారు. పైగా, షిరిడీ ఆలయ ప్రతిష్టకి భంగం కలిగించేలా ఉన్న ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక వైరల్ ఫోటోను పరిశీలించగా, కవిత తివారీ అనే ట్విట్టర్ యూసర్ 20 ఏప్రిల్ 2023లో చేసిన ట్వీట్ ఆధారంగా గూగుల్ ఈ సమాచారాన్ని ఇచ్చింది. అయితే, ఈ సమాచారం తప్పు అవ్వడంతో ఆమె ఈ ట్వీట్‌ను తొలగించారు. అలాగే, వైరల్ ఫొటోలో ఉన్న ‘Latestly’ వెబ్‌సైట్ పూర్తి కథనంలో కూడా ఇది తప్పుడు సమాచారమని చెప్పడం జరిగింది.

అయితే 2020లో కరోనా సంక్షోభ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు షిరిడీ ట్రస్ట్ 51 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. అలాగే, ఇది వరకు అనేక సేవా కార్యక్రమాలకు కూడా షిరిడీ ఆలయ ట్రస్ట్ విరాళాలు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 2021లో కూడా షిరిడీ ట్రస్ట్ మసీదులకు ₹96 కోట్లు విరాళం ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో మేము దానిని ఫాక్ట్ చెక్ చేసి అది తప్పుడు సమాచారమని నిర్ధారించాం. దానికి సంబంధించిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ హజ్ యాత్రికులకు ఎటువంటి విరాళం ఇవ్వలేదు. వైరల్ అవుతున్న పోస్టు ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll