Fake News, Telugu
 

శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మసీదులకు 96 కోట్ల విరాళం ఇచ్చిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

షిర్డీ సాయి ట్రస్ట్ ద్వారా మసీదులకు 96 కోట్ల విరాళం ఇచ్చారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. కానీ, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సాయి ట్రస్ట్ (శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ) మసీదులకు 96 కోట్లు విరాళం ఇచ్చింది.

ఫాక్ట్: శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మసీదులకు 96 కోట్ల విరాళం ఇచ్చిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2020లో కోవిడ్ రావటంతో, దాన్ని ఎదురుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు 51 కోట్ల రూపాయలు మార్చ్ లో విరాళం ఇచ్చింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో మసీదులకు విరాళాలు ఇచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.  

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, షిర్డీ సాయి ట్రస్ట్ అలా విరాళం ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది చేసి ఉంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ వారి అధికారిక ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్స్‌లో ఎక్కడా కూడా మసీదులకు 96 కోట్లు విరాళం ఇచ్చారని లేదు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ వెబ్సైటులో కూడా ఇటువంటి విరాళం గురించి లేదు.

2020లో కోవిడ్ రావటంతో, దాన్ని ఎదురుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు 51 కోట్ల రూపాయలు మార్చ్ లో విరాళం ఇచ్చింది. పేదలకు ఉచితంగా భోజనం పెట్టడం కోసం, వాళ్ళు ఉండటానికి వసతులు ఏర్పాటు చేయడం వంటి పనులు లాక్ డౌన్ లో ట్రస్ట్ చేసింది.

17 మార్చి 2020 నుండి 31 ఆగస్టు వరకు మందిరం 115.16 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది, గత ఏడాది (2019) ఇదే కాలంలో అందుకున్నది 289.55 కోట్లు, అంటే ఆదాయం రూ.174 కోట్లకు తగ్గిందని, ట్రస్ట్ సీఈఓ 2020లో తెలిపారు. గుడి నిర్వహణకు 55 కోట్లు అవుతుందని, అక్కడ పనిచేసే 5,500 మందికి 13 కోట్లు జీతాలు అవుతాయని తెలిపారు. అలాంటప్పుడు 2020లోనైతే 96 కోట్లు- అంతపెద్ద మొత్తంలో- మసీదులకు విరాళం ఇవ్వటం సాధ్యపడదు. వివిధ వార్తా సంస్థలతో ట్రస్ట్ సీఈఓ మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణానికి విరాళం కోసం ఎటువంటి ప్రతిపాదన తమ వద్దకు రాలేదని చెప్పారు.

చివరగా, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ మసీదులకు 96 కోట్ల విరాళం ఇచ్చిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll