‘ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలను పెళ్ళి చేసుకోవడంపై నిషేధం విధించిన రష్యా’, అని షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘లవ్ జిహాద్’ పేరుతో సంబోధిస్తున్న సంఘటనలు వేలాదిగా జరుగుతున్న భారతదేశంలో, ఇలాంటి విధానం ఎప్పుడు అమలులోకి వస్తుందని ప్రశ్నిస్తూ ఈ పోస్ట్ షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలను పెళ్ళి చేసుకోవడంపై నిషేధం విధించిన రష్యా.
ఫాక్ట్ (నిజం): ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని పెళ్లిచేసుకోకుడదని, ‘Spirtual Administration of Muslims of Russia’ అనే ముస్లిం సంస్థ స్కాలర్లు ఫత్వా జారీ చేసారు. ముస్లిం మతానికి చెందిన అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని కొన్ని షరతులతో, లోకల్ ముఫ్తిల అనుమతితో పెళ్లి చేసుకోవాలని ఈ ఫత్వాలో రాసారు. ఈ ఫత్వాకి రష్యా ప్రభుత్వం ఎటువంటి చట్టబద్దత కల్పించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం రష్యా ప్రభుత్వ వెబ్సైటులో వెతికితే, ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని పెళ్లి చేసుకోవద్దని ఆదేశమిస్తూ, రష్యా ప్రభుత్వం ఎలాంటి ఆదేశమివ్వలేదని తెలిసింది. ఈ ఫత్వా జారి చేసింది ‘Spirtual Administration of Muslims of Russia’ అనే రష్యా కి చెందిన ముస్లిం సంస్థ స్కాలర్లని మా విశ్లేషణలో తెలిసింది. ముస్లిం మతానికి చెందిన అబ్బాయిలు, ముస్లిమేతర అమ్మాయిలని కొన్ని షరతులతో, లోకల్ ముఫ్తిల అనుమతి తో పెళ్లి చేసుకోవాలని ఈ సంస్థ ఫత్వా జారీ చేసింది. మతాంతర వివాహాల వలన వస్తున్న కష్టాలని దృష్టిలో ఉంచుకొని ఈ ఫత్వా జారి చేసినట్టు స్కాలర్లు ఫత్వా లో పేర్కొన్నారు.
‘Spirtual Administration of Muslims of Russia’ జారి చేసిన ఈ ఫత్వాని రష్యా కి చెందిన కొన్ని ముస్లిం సంస్థలు వ్యతిరేకించాయి. “రష్యా ఒక సెక్యులర్ దేశం, ఈ ఫత్వాకు రష్యా ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధత కల్పించదు” అని ‘Spirtual Administration of Muslims of Russia’ సంస్థ డిప్యూటీ చైర్మన్ దమిర్ ముఖేట్దినోవ్ మీడియాకి స్పష్టం చేసారు.
చివరగా, ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని పెళ్లిచేసుకోవద్దని రష్యా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.