జాతీయ విద్యావిధానం 2020 యొక్క అవసరాన్ని వివరిస్తూ ఒక ఫేస్ బుక్ పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు సరైనవి కానందునే పాఠ్యపుస్తకాలలో భారతదేశ చరిత్ర వక్రీకరించబడింది అని ఈ పోస్టులో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి త్రిసభ్య కమిటీని నెహ్రూ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇద్దరు ముస్లిములు, మరియు ఒకరు క్రైస్తవ మతానికి చెందిన వారు ఉన్నారు.
ఫ్యాక్ట్ (నిజం): జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటైన కమిటీల్లో ఎక్కడా కూడా పోస్టులో చెప్పబడిన వ్యక్తులు రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, నూరుల్ హసన్ సభ్యులుగా లేరు. పైగా స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి వారి వయస్సు కేవలం 26, 16, 16 సంవత్సరాలుగా ఉంది. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో విద్యావిధానాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీల గురుంచి వెతికాము (సంబంధించిన వెబ్‌సైట్లు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు). మొదటగా, ‘యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్’ను 1948లో ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈ కమిషన్‌ని 06 డిసెంబర్ 1948లో ప్రారంభించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీలో మొత్తం పది మంది సభ్యులు ఉన్నారు.
ఈ కమిటీ భారత దేశంలో యూనివర్సిటీ విద్య, పరిశోధన గురుంచి ఎటువంటి విధానాలను పాటించాలో రిపోర్ట్‌లో పేర్కొంది. రిపోర్ట్ కాపీని ఇక్కడ చూడవచ్చు
ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రెండవ కమిటీ పేరు సెకండరీ ఎడ్యుకేషన్ కమీషన్ లేదా ముదలియార్ కమిషన్. ఈ కమిటీని 06 అక్టోబర్ 1952లో ప్రారంభించారు. అప్పటి మద్రాసు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అయిన డా.లక్ష్మణ్ స్వామి ముదలియార్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. కమిటీలోని సభ్యుల వివరాలు కింద చూడవచ్చు.
ఈ కమిటీ ముఖ్యంగా మాధ్యమిక విద్యలో పాటించాల్సిన విధానాలను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దానిని ఇక్కడ చూడవచ్చు
ఈ రెండు కమిటీల్లో ఎక్కడా కూడా పోస్టులో చెప్పిన నూరుల్ హసన్, ఇర్ఫాన్ హబీబ్, రోమిలా థాపర్ అనే పేర్లు లేవు. ఈ ముగ్గురు వ్యక్తుల వివరాలు గురించి వెతకగా స్వాతంత్ర్యం వచ్చే నాటికి వారి వయస్సు 26, 16,16 సంవత్సరాలు. వారికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన విద్యా కమీషన్లలో పోస్టులో చెప్పబడిన వ్యక్తులు సభ్యలుగా లేరు.