Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం ఫ్రాన్స్ వస్తువులని ఎడారిలో విసిరేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

0

ఫ్రాన్స్ వస్తువులను ఎడారిలో విసిరేస్తున్న సౌదీ అరేబియా, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటివల ఇస్లాం మతానికి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్లిం దేశాలలోని ప్రజలు భారీ ర్యాలీలు తీస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపధ్యంలో షేర్ అవుతున్న పోస్టులోని ఆ క్లెయిమ్ ఎంతవరకు నిజమో చూద్దాం.

    ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: సౌదీ అరేబియా ప్రభుత్వం ఫ్రాన్స్ వస్తువులను ఎడారిలో విసిరేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఆ వీడియో పాతది. వీడియోలో కనిపిస్తున్న ట్రక్కుల నుంచి విసేరేస్తున్నది నిల్వ చేసిన చికెన్ కార్టన్లు, ఫ్రాన్స్ దేశంలో తయారయిన వస్తువులు కాదు. 2016 లో కుళ్ళిపోయి ఉన్న 8 లక్షల చికెన్ కార్టన్లని అల్-ఖాసిం మునిసిపల్ కార్పొరేషన్ ఎడారిలో విసిరేస్తున్న దృశ్యం ఇది. ఈ వీడియోకి, ఇటివల ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకంగా ముస్లిం దేశాలు చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగి  ఉన్న వీడియోని ఒక అరబిక్ న్యూస్ ఛానల్ ‘18 నవంబర్ 2016’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. కుళ్ళిపోయి ఉన్న 8 లక్షల చికెన్ కార్టన్లని అల్-ఖాసిం మునిసిపల్ కార్పొరేషన్ ఎడారిలో ఖననం చేసిన దృశ్యాలంటూ వీడియో వివరణలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులోని వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ఘటనకు సంబంధించి ఒక అరబిక్ న్యూస్ వెబ్ సైట్ 2016లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. కుళ్ళిపోయిన చికెన్ మాంసాన్ని తరలిస్తున్న 25 ట్రక్కులని అల్-ఖాసిం మున్సిపల్ కార్పొరేషన్ సీజ్ చేసినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఆ 25 ట్రక్కులలో ఉన్న 8 లక్షల కుళ్ళిపోయిన చికెన్ కార్టన్లని అల్-ఖాసిం మున్సిపల్ శాఖా ఎడారిలో ఖననం చేసినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘Alriyadh’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకంగా ఇటివల ముస్లిం దేశాలు చేస్తున్న నిరసనలకి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం ఫ్రాన్స్ వస్తువులని ఎడారిలో విసిరేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll