Fake News, Telugu
 

కాశ్మీర్‌లో ఉంటున్న రోహింగ్యాలను తిరిగి వారి దేశాలకు పంపించలేదు, ప్రస్తుతం వారు ఇంకా సహాయ శిబిరాలలోనే ఉంటున్నారు

0

‘జమ్ము కాశ్మీర్‌లో అక్రమంగా ఉంటున్న 6523 మంది రోహింగ్యాలను గుర్తించి తిరిగి వారిని వాళ్ళ దేశానికి పంపిస్తున్న భారత ప్రభుత్వం’ అని చెప్తూ, దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఈ వీడియో గతంలో ఇదే క్లెయిమ్‌తో షేర్ అవగా, ప్రస్తుతం తిరిగి మళ్ళీ షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లోని అక్రమంగా ఉంటున్న 6523 మంది రోహింగ్యాలను గుర్తించి తిరిగి వారిని వాళ్ళ దేశానికి పంపిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని రోహింగ్యాలను తిరిగి వాళ్ళ దేశానికి పంపించే ఘటనలేవి జరగలేదు. గత సంవత్సరం మార్చ్ లో (2021 మార్చ్) సహాయ శిబిరాలలో ఉంటున్న రోహింగ్యా శరణార్థులు తమని పోలీసులు నిర్బంధిస్తారెమో అనే భయంతో శిబిరాలను వదిలి వెళ్ళిపోయారు. పోస్టులో షేర్ చేసిన వైరల్ వీడియో గత సంవత్సరం జరిగిన ఈ ఘటనకు సంబంధించిందే అయి ఉంటుంది. ఐతే గత సంవత్సరం ఈ ఘటన జరిగినప్పుడు శరణార్థులెవరినీ కూడా దేశం నుండి పంపించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిని ఇంకా సహాయ శిబిరాలు మరియు హోల్డింగ్ సెంటర్లలోనే ఉంచారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని రోహింగ్యాలను తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తున్నట్టు ఎటువంటి వార్తా సమాచారం లేదు. ఐతే పైన చెప్పినట్టు ఈ వీడియో మార్చ్ 2021లో మొదటిసారిగా షేర్ అయ్యింది.

దీని ఆధారంగా వెతకగా మార్చ్ 2021లో జమ్ముకాశ్మీర్‌లోని రోహింగ్యాలను అరెస్ట్ చేసి హోల్డింగ్ సెంటర్లలో పెట్టిన కథనాలు మాకు లభించాయి (ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం జమ్మూలో దశాబ్ద కాలం నుండి సహాయ శిబిరాలలో ఉంటున్న రోహింగ్యా శరణార్థులలో సుమారు ఒక 160 మందిని పోలీసులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హోల్డింగ్ సెంటర్లకు తరలించడంతో, తమని కూడా ఎక్కడ నిర్బంధిస్తారో అని భయపడి సహాయ శిబిరాల ఉంటున్న మిగతా రోహింగ్యా శరణార్థులలో కొందరు  శిబిరాలను వదలి వెళ్ళిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియో గత సంవత్సరం జరిగిన ఈ ఘటనకు సమబంధించిందే అయి ఉంటుంది. ఈ ఘటన జరిగి సంవత్సరం గడుస్తుండడంతో తిరిగి మళ్ళీ ఈ వీడియోలను షేర్ చేసి ఉంటారు.

దేశంలో ఉంటున్న శరణార్థులకు సంబంధించి విడుదల చేసిన రిపోర్ట్ లోకూడా గత సంవత్సరం మార్చ్ లో ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా జమ్మూలో ఉంటున్న 168 మంది శరణార్థులను కతువా జిల్లా సబ్ జైలులో ఏర్పాటు చేసిన హోల్డింగ్ సెంటర్లకు తరలించినట్టు పేర్కొన్నారు.

ఐతే లేటెస్ట్ కథనాల (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం ఈ శరణార్థులను హోల్డింగ్ సెంటర్లలో నిర్బంధించారే తప్ప వారిని తిరిగి వారి దేశాలకు పంపించలేదు. వారు ప్రస్తుతం సహాయ శిబిరాలు మరియు హోల్డింగ్ సెంటర్లలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా వీరిని హోల్డింగ్ సెంటర్ల నుండి విడుదల చేయడానికి నిరాకరించింది. వీరిని తిరిగి వారి దేశాలకు పంపడానికి కోర్టు అనుమతించినప్పటికీ, పూర్తీ ప్రొసీజర్ పాటించిన తరవాతే పంపించాలని చెప్పింది. ఐతే ఇప్పటివరకు మాత్రం వారిని తిరిగి వారి దేశాలకు పంపించలేదు.

చివరగా, కాశ్మీర్‌లో ఉంటున్న రోహింగ్యాలను తిరిగి వారి దేశాలకు పంపించలేదు, ప్రస్తుతం వారు ఇంకా సహాయ శిబిరాలలోనే ఉంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll