మహారాష్ట్ర నుండి భారీ బైక్ ర్యాలీతో హిందూ కార్యకర్తలు బోధన్‌కి తరలివస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. తెలంగాణ రాష్ట్రం బోధన్ పట్టణంలో ఇటీవల చత్రపతి శివాజీ విగ్రహాం ఏర్పాటుకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శివాజీ విగ్రహం ఏర్పాటును అడ్డుకున్న వర్గంపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ 21 మర్చి 2022 నాడు బోధన్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో, పోస్టులో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మహారాష్ట్ర నుండి భారీ బైక్ ర్యాలీతో హిందూ కార్యకర్తలు బోధన్‌కి తరలివస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో 2021 ఆగష్టు నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వీడియోకి ఇటీవల బోధన్‌లో జరిగిన ఘర్షణకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సీర్ర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు కనీసం 2021 ఆగష్టు నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
20 ఆగష్టు 2021 నాడు మహారాష్ట్ర నాందేడ్ నగరంలో జరిగిన మరాఠా క్రాంతి ముఖ్ మోర్చా కార్యక్రమానికి హిందూ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో తరలివెలుతున్న దృశ్యాలని పలు యూట్యూబ్ యూసర్లు ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు. 2021 ఆగష్టు నెలలో నాందేడ్‌లో జరిగిన మరాఠా క్రాంతి ముఖ్ మోర్చా కార్యక్రమం దృశ్యాలని ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియో మరాఠా క్రాంతి ముఖ్ మోర్చా కార్యక్రమానికి సంబంధించినదా లేదా అని స్పష్టంగా తెలియనప్పటికీ ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, ఇటీవల బోధన్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, సంబంధం లేని పాత వీడియోని హిందూ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ మహారాష్ట్ర నుండి బోధన్‌కు తరలివస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.