2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ముంబై తాజ్ హోటల్ పై దాడి చేసి అనేక ప్రాణాలను బలిగొన్న కసబ్ తరపున వాదించిన న్యాయవాది మాజిద్ మెమన్‌కు శరద్ పవార్ MP టికెట్ ఇవ్వగా, అదే కసబ్‌కి ఊరి శిక్ష పడేలా వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ MP టికెట్ ఇచ్చింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ పోస్టులో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: శరద్ పవార్ అజ్మల్ కసబ్ న్యాయవాది మజీద్ మెమన్‌ను రాజ్యసభ ఎంపీగా చేశారు, అదే కసబ్‌కు ఉరిశిక్ష పడేలా చేసిన న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది.
ఫాక్ట్(నిజం): ప్రముఖ క్రిమినల్ లాయర్ మజీద్ మెమన్‌కు అజ్మల్ కసబ్ విచారణతో సంబంధం లేదు, ఆయన కసబ్ తరపున వాదించలేదు. మజీద్ మెమన్ ఏప్రిల్ 2014 నుండి ఏప్రిల్ 2020 వరకు NCP నుండి రాజ్యసభ ఎంపీగా పనిచేశాడు. 2022లో మజీద్ మెమన్ ఎన్సీపీ(NCP)కి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు. ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీ టికెట్ కేటాయించింది. అలాగే, కసబ్ తరపున వాదించిన న్యాయవాదికి శరద్ పవార్ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ పోస్టులో చేసిన క్లెయిమ్‌లకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, నిజంగానే బీజీపీ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ ఎంపి సీటు ఇచ్చినట్లు తెలిసింది. ముంబై 26/11 ఉగ్రదాడి విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉజ్వల్ నికమ్ 1993 ముంబై వరుస పేలుళ్ల కేసు, శక్తి మిల్స్ సామూహిక అత్యాచారం కేసు, అహ్మద్‌నగర్ రేప్ మరియు హత్య కేసు వంటి అనేక ఇతర హై ప్రొఫైల్ కేసులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా పనిచేశాడు.(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).
26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో అజ్మల్ కసబ్ తరపున వాదించడానికి ఏ న్యాయవాది ఆసక్తి చూపనందున, ఈ కేసులో న్యాయమైన విచారణ జరిగేలా, కసబ్‌కు న్యాయ సహాయం అందించడానికి న్యాయస్థానంమే పులువురు న్యాయవాదులను నియమించింది(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). నిందితుడికి న్యాయమైన మరియు పారదర్శకమైన విచారణకు హక్కు ఉంది, నిందితుడిని తరపున ఎవరు వాదించకపోతే అది అసాధ్యం. అందువలనే ఈ కేసులో కసబ్ తరపున వాదించడానికి న్యాయస్థానంమే పులువురు న్యాయవాదులను నియమించింది. ఈ కేసు విచారణ మొదటి దశలో కసబ్ యొక్క లాయర్‌గా అబ్బాస్ కజ్మీ న్యాయస్థానంచే నియమించబడ్డాడు, కానీ తరువాత సహకరించని కారణంగా అబ్బాస్ కజ్మీని తొలగించారు. అతరువాత కసబ్ యొక్క డిఫెన్స్ లాయర్‌గా KP పవార్ నియమితులయ్యారు మరియు విచారణలో ముఖ్యమైన సమయంలో కసబ్‌కు ప్రాతినిధ్యం వహించారు. కసబ్ తన మరణ శిక్షను బాంబే హైకోర్టులో అప్పీల్ చేసినప్పడు, బాంబే హైకోర్టు కసబ్ తరపున వాదించేందుకు న్యాయవాదులు అమీన్ సోల్కర్ మరియు ఫర్హానా షాలను నియమించింది. అలాగే, మరణశిక్షపై సుప్రీంకోర్టులో కసబ్ అప్పీల్ చేసిన సమయంలో రాజు రామచంద్రన్ కసబ్ న్యాయవాదిగా వ్యవహరించారు. గోపాల్ సుబ్రమణ్యం ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో అజ్మల్ కసబ్ మరణశిక్షను సమర్ధిస్తూ వాదించారు.
అజ్మల్ కసబ్ విచారణతో భారతదేశంలోని ప్రముఖ క్రిమినల్ లాయర్ మజీద్ మెమన్‌కు ఎలాంటి సంబంధం లేదు, ఆయన కసబ్ తరపున వాదించలేదు. పైగా ఆయన కసబ్ తరుపున వాదించేందుకు తనకు ఆసక్తి లేదని కూడా తెలిపినట్లు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ & ఇక్కడ). మజీద్ మెమన్ 1993 ముంబై వరుస పేలుళ్ల వంటి పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేసాడు, ఈ కేసులో చాలా మంది నిందితుల తరపున ఆయన వాదించారు. అలాగే. పలు క్రిమినల్ కేసుల్లో పలువురు సినీ నటులు, ప్రముఖుల తరపున కూడా వాదించారు. మజీద్ మెమన్ ఏప్రిల్ 2014 నుండి ఏప్రిల్ 2020 వరకు NCP నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు (ఇక్కడ & ఇక్కడ). 2022లో మజీద్ మెమన్ ఎన్సీపీని(NCP) వీడి తృణమూల్ కాంగ్రెస్(TMC)లో చేరారు (ఇక్కడ & ఇక్కడ).
అలాగే, కసబ్ తరపున వాదించిన న్యాయవాదికి శరద్ పవార్ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.
చివరగా, రాజ్యసభ మాజీ ఎంపీ మజీద్ మెమన్ అజ్మల్ కసబ్ తరపున వాదించలేదు, కసబ్ తరపున వాదించిన న్యాయవాదికి శరద్ పవార్ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేవు.