తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లంబాడాలను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసాడంటూ ఒక వీడియో షేర్ అవుతుంది. లంబాడాలకు వెయ్యి రూపాయలు ఇచ్చి, గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారని ఈ వీడియోలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: లంబాడాలను వెయ్యి రూపాయలు ఇచ్చి, గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారు – తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
ఫాక్ట్(నిజం): లంబాడాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయలేదు. అంతకు ముందు కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికు ఈ వ్యాఖ్యలను ఆపాదించాడు. ఐతే పరిగిలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ చేసిన ఈ ఆరోపణలకు వివరణ ఇచ్చే క్రమంలో ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించాడు. ఐతే ఈ వివరణలో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని అసంబద్దంగా ఎడిట్ చేసి (ముందు/వెనక కట్ చేసి), కేవలం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన క్లిప్‌ను మాత్రమే కట్ చేసి, రేవంత్ రెడ్డి నిజంగానే ఇలా వ్యాఖ్యానించినట్టు అర్ధం వచ్చేలా చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాన్ని అసంపూర్ణంగా కట్ చేసింది. అసలు వీడియోలో రేవంత్ రెడ్డి లంబాడాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో వెతకగా, దీనికి సంబంధించిన పూర్తి ఫుటేజ్ మాకు దొరికింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగిలో జరిగిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం నుండి ఈ వీడియోను సేకరించారు. ఐతే ఈ ప్రసంగంలో కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ‘లంబాడాలను వెయ్యి రూపాయలు ఇచ్చి, గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారు’ అని అన్నాడని ఆరోపించారు. ఐతే కేసీఆర్ చేసిన ఈ ఆరోపణలకు పరిగిలో రోడ్ షోలో వివరణ ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘లంబాడాలను వెయ్యి రూపాయలు ఇచ్చి, గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారు’ అని కేసీఆర్ తనకు ఆపాదించిన వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేసారు.
ఈ క్రమంలోనే కేసీఆర్ తనకు ఆపాదించిన వ్యాఖ్యలను (లంబాడాలను వెయ్యి రూపాయలు ఇచ్చి, గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారు) పునరుద్ఘాటించిన క్లిప్‌ను మాత్రమే కట్ చేసి, రేవంత్ రెడ్డి నిజంగానే ఇలా వ్యాఖ్యానించినట్టు అర్ధం వచ్చేలా చేసారు. కాని రేవంత్ రెడ్డి ఈ ప్రసంగంలో లంబాడాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణను రిపోర్ట్ చేసిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో కూడా రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ తనకు ఆపాదించిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీన్నిబట్టి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసంబద్దంగా ఎడిట్ చేసి (ముందు/వెనక కట్ చేసి) స్పష్టంగా అర్ధమవుతుంది.
చివరగా, లంబాడాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయలేదు; రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని అసంబద్దంగా ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.