Fake News, Telugu
 

తిరుమలలో శ్రీవారి మెట్ల మార్గం ఎప్పటి నుంచో ఉంది; ఇటీవల రిలయన్స్ సంస్థ అలిపిరి మార్గాన్ని పునర్నిర్మించేందుకు అయ్యే మొత్తం ఖర్చుని భరించింది

0

‘తిరుమలలో కాలి నడకన వెళ్ళే భక్తుల కోసం రిలయన్స్ సంస్థ కొత్తగా ఒక మెట్ల మార్గం నిర్మించిందని, ఈ మార్గం ద్వారా ఐతే కేవలం 2388 మెట్లలో తిరుమల చేరుకోవచ్చని, అదే పాత మార్గం ద్వారా ఐతే 6588 మెట్లు ఎక్కవలసి వచ్చేదని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రిలయన్స్ సంస్థ తిరుమలలో కాలి నడకన వెళ్ళే భక్తుల కోసం 2388 మెట్లతో చిన్న మెట్ల మార్గాన్ని నిర్మించింది.

ఫాక్ట్ (నిజం): సాధారణంగా తిరుమల కొండని నడక మార్గం ద్వారా ఎక్కడానికి అలిపిరి నుండి 11 కిలోమీటర్ల మేర సుమారు 3550 మెట్లతో ఒక మార్గం, శ్రీనివాస మంగాపురం దగ్గరి నుండి 2 కిలోమీటర్ల మేర సుమారు 2388 మెట్లతో మరో మార్గం ఉంటుంది. 2000 దశాబ్దం చివరిలో టీటీడీ ఈ మార్గాన్ని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఐతే ఇటీవల రిలయన్స్ సంస్థ అలిపిరి మార్గాన్ని 25 కోట్లతో పునర్నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్నే రిలయన్స్ సంస్థ 2388 మెట్లతో కొత్త మార్గాన్ని నిర్మించిందని పొరపాటు పడ్డారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా తిరుమల కొండని నడక మార్గం ద్వారా ఎక్కేవారికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి దగ్గరిది కాగా, మరొకటి అలిపిరి నుండి 20 కిలోమీటర్ల దూరంలోని శ్రీనివాస మంగాపురం దగ్గరి శ్రీవారి మెట్ల మార్గం. అలిపిరి నుండి వెళ్ళే మార్గం 11 కిలోమీటర్ల మేర సుమారు 3550 మెట్లతో ఉంటుంది, రెండింటిలో ఇదే పొడవైన మార్గం. ఇది మొదటి నుండి భక్తులకు అందుబాటులో ఉన్న మార్గం. ఈ మార్గాలకి సంబంధించిన పలు ఆన్లైన్ బ్లాగ్‌లు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

శ్రీనివాస మంగాపురం దగ్గర శ్రీవారి మెట్ల మార్గం 2 కిలోమీటర్ల మేర సుమారు 2388 మెట్లతో మరో మార్గం ఉంటుంది. ఐతే ఇది చాలా పురాతన మార్గమే అయిన, ఈ మార్గం మొదటి నుండి భక్తులకు అందుబాటులో లేదు. 2000 దశాబ్దం చివరిలో టీటీడీ ఈ మార్గాన్ని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తెచ్చిందని ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది.

అలిపిరి మెట్ల మార్గం – రిలయన్స్ సంస్థ:

2019లో సుమారు 7.6 కిలోమీటర్ల మేర అలిపిరి మెట్ల మార్గాననికి మరమత్తులు చేసి పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయించి 2020లో పనులు మొదలు పెట్టింది. ఈ మార్గంలోని తాగునీటి పైప్‌లైన్‌లు, టాయిలెట్‌లు, ఆరోగ్య కేంద్రాలు, సెక్యూరిటీ అవుట్‌ పోస్టులు, విద్యుత్ మరియు బ్రాడ్‌కాస్టింగ్ కేబుల్స్‌ మొదలైన సదుపాయాలను పునర్నిర్మించాలని, దీనికి 25 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఐతే రిలయన్స్ సంస్థ ఈ అలిపిరి మెట్ల మార్గాననికి మరమత్తులు చేసి పునర్నిర్మించడానికి అయ్యే పూర్తి ఖర్చుని భరిస్తామని ముందుకు రావడంతో టీటీడీ ఈ అవకాశాన్ని  రిలయన్స్ సంస్థకు ఇచ్చింది. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ  చూడొచ్చు.

ఐతే రిలయన్స్ సంస్థ అలిపిరి మార్గాన్ని పునర్నిర్మించిన విషయాన్నే రిలయన్స్ సంస్థ కొత్తగా 2388 మెట్లతో కొత్త మార్గాన్ని నిర్మించిందని తప్పుగా అర్ధం చేసుకొని ఇలా షేర్ చేస్తునట్టు ఉంది.

చివరగా, తిరుమలలో శ్రీవారి మెట్ల మార్గం ఎప్పటి నుంచో ఉంది; ఇటీవల రిలయన్స్ సంస్థ అలిపిరి మార్గాన్ని పునర్నిర్మించేందుకు అయ్యే మొత్తం ఖర్చుని భరించింది.

Share.

About Author

Comments are closed.

scroll